అటవీ శాఖలో కలకలం.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్..!
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా అటవీశాఖలో ముగ్గురు అధికారుల సస్పెన్షన్ తీవ్ర కలకలం రేపుతోంది. ఎకో టూరిజం పార్క్ కింద చేపట్టిన గండి రామన్న హరితవనం ప్రాజెక్టులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు.. ఫారెస్ట్ డివిజనల్ అధికారితోపాటు మరో ఇద్దరు జూనియర్ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం నిర్మల్ అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి దగ్గర్లోని గండి […]
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా అటవీశాఖలో ముగ్గురు అధికారుల సస్పెన్షన్ తీవ్ర కలకలం రేపుతోంది. ఎకో టూరిజం పార్క్ కింద చేపట్టిన గండి రామన్న హరితవనం ప్రాజెక్టులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు.. ఫారెస్ట్ డివిజనల్ అధికారితోపాటు మరో ఇద్దరు జూనియర్ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం నిర్మల్ అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
నిర్మల్ జిల్లా కేంద్రానికి దగ్గర్లోని గండి రామన్న అటవీ కలప డిపోతో పాటు రిజర్వు ఫారెస్ట్‌ను కలుపుతూ ఎకో టూరిజం ప్రాజెక్టు కింద పార్కు ఏర్పాటును ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పార్కు నిర్మాణ ఫెన్సింగ్ పనుల్లో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. నిర్మల్ ఎఫ్‌డీఓ గోపాల్‌రావుతో పాటు అటవీ సెక్షన్ అధికారి అర్షద్ రాజా, బీట్ అధికారి మోహిద్.. కాంట్రాక్టర్‌కు మేలు జరిగేలా అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చీఫ్ కన్జర్వేటర్ వినోద్ కుమార్ వివరణ కోరుతూ ముగ్గురు అధికారులకు మెమోలు జారీ చేశారు. దీనికి సంబంధించి అధికారులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో పాటు కాంట్రాక్టర్లకు మేలు జరిగే విధంగా ఉన్నట్లు తేలింది. సమగ్ర విచారణ తర్వాత ఎఫ్‌డీఓ గోపాల్‌రావుతో పాటు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు.
అటవీ శాఖలో కలకలం..
ఒకేసారి ముగ్గురు అధికారులు సస్పెన్షన్‌కు గురైన వ్యవహారం నిర్మల్ అటవీ శాఖలో కలకలం రేపుతోంది. గతంలో కలప అక్రమ రవాణా కేసుల్లో మాత్రమే సస్పెన్షన్‌కు గురైన సంఘటనలు జరిగాయి. కానీ తాజాగా ఒక పార్క్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో జిల్లా అటవీశాఖ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవలనే మంచిర్యాల జిల్లా ఎఫ్‌డీఓ సస్పెన్షన్‌కు గురికావడం, తాజాగా నిర్మల్ జిల్లాలో ముగ్గురు అధికారులపై వేటు పడటం చర్చనీయాంశంగా మారింది.
Tags: Adilabad, Forest Department, Nirmal Range, Eco Tourism Park, suspension of three officers, Gandi Ramanna Harithavanam