జిల్లా ‘కారు’.. ఎక్కడ సారు?

         అధికార టీఆర్ఎస్ పార్టీకి జిల్లాలవారీగా అధ్యక్షుల నియామకంపట్ల నీలినీడలు కమ్ముకుంటున్నాయని పలువురు ఆ పార్టీ నేతలే అంటున్నారు. సాధారణంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలకు జిల్లాలో అధ్యక్షులుండటం సహజం. అయితే, గులాబీ పార్టీ ఉద్యమవేళ కొన్ని జిల్లాలను తూర్పు, పశ్చిమాలుగా విభజించి మరీ అధ్యక్షులను నియమించింది. కానీ, అధికారంలోకొచ్చాక జిల్లా అధ్యక్షుల నియామకాల పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదనీ, అసలు జిల్లా అధ్యక్ష పదవుల భర్తీ ఉంటుందా, లేదా అనే అంశంపై […]

Update: 2020-02-17 06:10 GMT

అధికార టీఆర్ఎస్ పార్టీకి జిల్లాలవారీగా అధ్యక్షుల నియామకంపట్ల నీలినీడలు కమ్ముకుంటున్నాయని పలువురు ఆ పార్టీ నేతలే అంటున్నారు. సాధారణంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలకు జిల్లాలో అధ్యక్షులుండటం సహజం. అయితే, గులాబీ పార్టీ ఉద్యమవేళ కొన్ని జిల్లాలను తూర్పు, పశ్చిమాలుగా విభజించి మరీ అధ్యక్షులను నియమించింది. కానీ, అధికారంలోకొచ్చాక జిల్లా అధ్యక్షుల నియామకాల పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదనీ, అసలు జిల్లా అధ్యక్ష పదవుల భర్తీ ఉంటుందా, లేదా అనే అంశంపై టీఆర్ఎస్ వర్గాల్లో ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.

పార్టీ బలోపేతం వారితోనే..

వాస్తవానికి పార్టీ కోసం కష్టపడి పనిచేయడం, గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంలో జిల్లా అధ్యక్షులు క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. అలాంటి జిల్లా అధ్యక్ష పదవులను నియమించే విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం ఎందుకు వెనకడుగు వేస్తున్నది అర్థం కావడం లేదని సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అయితే, పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షుల నియామకం చేయకపోయినా సంస్థాగతంగా మండల, పట్టణ, వార్డు అధ్యక్షులతోపాటు పూర్తిస్థాయి కమిటీలను మాత్రం నియమించింది. ఇప్పటికే ఈ కమిటీల నియామకాలు, ఎన్నికలు ఎప్పుడో పూర్తయ్యాయి. కానీ, జిల్లా అధ్యక్షుల విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

జిల్లా బాస్‌లు లేనట్టేనా..?

అధికార టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల విధానానికి స్వస్తి చెప్పినట్టేనా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పింక్ పార్టీలో రాష్ట్రస్థాయిలో అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్ష పదవుల్లో తండ్రీ కొడుకులైన కేసీఆర్, కేటీఆర్‌లు కొనసాగుతున్నారు. ఇక జిల్లాల అధ్యక్షుల స్థానాలపై, నియామకాలపై ఇంతవరకు సీఎం కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ స్పష్టత ఇవ్వలేదు. రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జిల్లాల్లో అధ్యక్షులకు బదులు కోఆర్డినేటర్లను నియమించాలన్న అభిప్రాయం తెరపైకి వచ్చింది. ఒక సందర్భంలో జిల్లాకు ఇద్దరు కోఆర్డినేటర్‌లను నియమించాలనుకున్నారు. కానీ, అదీ కార్యరూపం దాల్చలేదు. దీన్నిబట్టి ప్రస్తుతం కోఆర్డినేటర్ల విధానంపై పార్టీ అధిష్టానానికి ఆసక్తి లేనట్టు తెలుస్తున్నది.

నాన్చుడు ధోరణిపై నేతల గుస్సా

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నప్పటికీ జిల్లా స్థాయిలో స్థానిక నాయకత్వం తప్పనిసరిగా ఉండాలనీ, లేదంటే పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కాదని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పార్టీల్లో అన్ని జిల్లాలకు అధ్యక్షులను ఎన్నుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం జిల్లాల అధ్యక్షుల నియామకం విషయంలో నాన్చుడు ధోరణిపై గులాబీ శ్రేణులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు దక్కని సీనియర్లు తమను కనీసం పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల్లోనైనా నియమిస్తారని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.

Tags:    

Similar News