సిటిజన్లకు ఫియర్.. సర్వేయర్లకు టెన్షన్

దిశ, న్యూస్‌బ్యూరో: ఇప్పుడు సర్వేలు చేయడమేంటీ… ఇలా కూడా సర్వే చేస్తారా.. మీరు అసలు జీహెచ్ఎంసీ ఉద్యోగులేనా.. మీ ఐడీ కార్డులేవి.. తగిన ఆధారాలు చూపించండి..’ అంటూ సర్వే కోసం వచ్చిన మహిళా టీచర్లను ఓల్డ్ సిటీలో కొందరు పౌరులు ప్రశ్నించారు. ఇది జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న అక్షరాస్యుల జాబితా సర్వే కోసం వెళ్తున్నవారికి ఎదురైన ఓ చేదు అనుభవం. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్పీఆర్‌పై ఆందోళనలు చెలరేగుతున్న సందర్భంలో గ్రేటర్ హైదరాబాద్‌లో అక్షరాస్యుల సర్వే చేపడుతున్నారు. 18 […]

Update: 2020-02-26 08:46 GMT

దిశ, న్యూస్‌బ్యూరో:

ఇప్పుడు సర్వేలు చేయడమేంటీ… ఇలా కూడా సర్వే చేస్తారా.. మీరు అసలు జీహెచ్ఎంసీ ఉద్యోగులేనా.. మీ ఐడీ కార్డులేవి.. తగిన ఆధారాలు చూపించండి..’ అంటూ సర్వే కోసం వచ్చిన మహిళా టీచర్లను ఓల్డ్ సిటీలో కొందరు పౌరులు ప్రశ్నించారు. ఇది జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న అక్షరాస్యుల జాబితా సర్వే కోసం వెళ్తున్నవారికి ఎదురైన ఓ చేదు అనుభవం.

దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్పీఆర్‌పై ఆందోళనలు చెలరేగుతున్న సందర్భంలో గ్రేటర్ హైదరాబాద్‌లో అక్షరాస్యుల సర్వే చేపడుతున్నారు. 18 ఏళ్లు నిండినవారిలో అక్షరాస్యులు, నిరక్షరాస్యుల జాబితాను తేల్చే పనిలో ఉన్నారు. ఇందుకు శిక్షణ ఇచ్చి జనవరి 24 నుంచి మార్చి 4 వరకు సర్వే చేయాలని నిర్ణయించారు. అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లు ప్రస్తుతం ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వే కోసం ఓల్డ్ సిటీలోలోని చాంద్రాయణగుట్టకు వెళ్లిన మహిళా ఉద్యోగుల్లో కొందరికి తెలుగు తప్ప ఉర్దూ రాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. అయితే స్థానికంగా ఉండే ఎస్‌హెచ్‌జీలు, సామాజిక కార్యకర్తల సహకారం తీసుకుంటామని బల్దియా అధికారులు చెప్పినా క్షేత్రస్థాయిలో అలా కనిపించడం లేదు.

అక్షరాస్యత సర్వే చేయడం ఫస్ట్ టైం చూస్తున్నామని, ఇలాంటి సర్వే ఇంతకు ముందు తమకు తెలియదని కొందరు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడే పుట్టి పెరిగిన తాము పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటే ఏం చేయాలో తెలియట్లేదని, ముస్లింలమైన కారణంగానే తమను భారతీయులుగా గుర్తించని పరిస్థితుల్లో ఇలాంటి సర్వేలు చేస్తున్నారని వారు సున్నితంగా తిరస్కరిస్తున్నారు. దొంగచాటుగా ఎన్పీఆర్ సర్వే కోసమే వచ్చారోమోననే అనుమానాలు కూడా వస్తున్నాయని, అయినా దేశంలో అశాంతితో హిందువులు, ముస్లింలు చనిపోతున్న టైంలో సర్వే చేయడం సరికాదని సర్దిచెప్పారు. ఈ గొడవలన్నీ ముగిశాక వస్తే తామే ఇంటింటికీ తిప్పి సర్వే చేయిస్తామని చెప్పడంతో సిబ్బంది వెనుదిరగక తప్పడంలేదు. మరోవైపు చాలాప్రాంతాల్లో సర్వే సిబ్బందికి, స్థానికులకు తీవ్రస్థాయిలో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అటు పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేస్తూనే, నేరుగా మేయర్ బొంతు రామ్మోహన్ కు ఫోన్ చేసి పరిస్థితులు చక్కబడేవరకూ సర్వేను నిలిపివేయాలని కోరుతున్నారు.

కొద్దిరోజుల క్రితం కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలతో తెలంగాణ, హైదరాబాద్‌ల్లోనూ అనుకూల, ప్రతికూల ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అక్షరాస్యుల జాబితా తయారీ కోసం జీహెచ్ఎంసీ సర్వే చేపట్టడం వివాదంగా మారుతోంది. ఇంటికి ఏసర్వే కోసం వచ్చినా పేరు, కుటుంబ వివరాలు ఎవరు అడిగినా అనుమానంగా చూడాల్సిన పరిస్థితుల్లో ఇలాంటి సర్వేలు చేపట్టకపోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News