తెలంగాణ మంత్రుల కదలికలపై నిఘా..
దిశ, న్యూస్ బ్యూరో: ఓ ఉద్యోగ సంఘం నాయకురాలి ఇంటిలో జరిగిన దావత్‌కు ఓ మంత్రి వెళ్లాడు. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలే కరోనా సమయం. బయటకు తెలిస్తే ఆరోపించేవారు ఎక్కువయ్యారు. వెళ్లాల్సినంత అవసరం ఏమోచ్చింది? ఓ మంత్రి ఇటీవలే తన ప్రధాన అనుచరుడు, ఆర్థిక లావాదేవీలను చూసే వ్యక్తికి ఓ పదవి ఇప్పించారు. ఈ విషయం స్థానికంగా జిల్లాలో విభేదాలకు దారి తీశాయి. ఇలాంటి పరిస్థితులు ఎందుకు కల్పించుకుంటున్నారు? మరో మంత్రి ఓ జిల్లాకు చెందిన […]
దిశ, న్యూస్ బ్యూరో: ఓ ఉద్యోగ సంఘం నాయకురాలి ఇంటిలో జరిగిన దావత్‌కు ఓ మంత్రి వెళ్లాడు. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలే కరోనా సమయం. బయటకు తెలిస్తే ఆరోపించేవారు ఎక్కువయ్యారు. వెళ్లాల్సినంత అవసరం ఏమోచ్చింది?
ఓ మంత్రి ఇటీవలే తన ప్రధాన అనుచరుడు, ఆర్థిక లావాదేవీలను చూసే వ్యక్తికి ఓ పదవి ఇప్పించారు. ఈ విషయం స్థానికంగా జిల్లాలో విభేదాలకు దారి తీశాయి. ఇలాంటి పరిస్థితులు ఎందుకు కల్పించుకుంటున్నారు?
మరో మంత్రి ఓ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల వివాదంలో కీలకంగా మారారు. ఓ ఎమ్మెల్యే బహిరంగ విమర్శలు చేశాడు. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రులుంటే ఓ మంత్రి ఒకరికి, మరో మంత్రి మరొకరికి అండగా ఉండే వాతావరణం ఏర్పడింది. ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇలాంటి ఉదాహరణలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారనే విషయాలపై సమగ్రమైన, లోతైన విచారణ మొదలైంది. ప్రగతిభవన్ నిఘా వర్గాలు సీఎం కేసీఆర్‌కు రహస్య నివేదికలు అందిస్తున్నాయి. కొంతమంది సీఎం అప్పాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని, సీఎం దర్శనభాగ్యం లభించకపోవడంతో అనుచరుల దగ్గర ఏం చెప్పుకోలేక వ్యతిరేకతతో ఉన్నారనే సమాచారం కూడా పెద్దసారుకు అందుతోంది.
గ్రామస్థాయి నుంచి విచారణ..
మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై గ్రామస్థాయి నుంచి పరిశీలన మొదలైంది. అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్ ఇలాంటి విషయాలన్నీ కుండబద్దలు కొట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై కచ్చితంగా పరిశీలన చేస్తామని, చీమచిటుక్కుమన్నా తెలిసిపోతుందని హెచ్చరికలు జారీచేశారు. అప్పటికే జిల్లాల్లో తిరుగుతూ పనిచేస్తున్న కొద్దిమంది మంత్రులను మెచ్చుకున్నారు. మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల పనితీరుపై మూడంచెల్లో వివరాల సేకరణ జోరుగా సాగుతోంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో గ్రామస్థాయిలో ఏ మేరకు ప్రజలకు అందుబాటులో ఉన్నారో వివరాలన్నీ సీఎంకు చేరుతున్నాయి. కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు సొంతంగా ఖర్చు పెట్టుకుని పని చేసినా మరికొంతమంది వ్యాపారుల నుంచి వసూలు చేసి కూడా పేదలకు సాయం చేయలేదనే ఆరోపణలున్నాయి.
ఎమ్మెల్యేలతో పొసగడం లేదు..
కొంతమంది మంత్రులకు జిల్లాల్లో ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు ఉండటం లేదని తేలింది. గ్రూపులు ఎక్కువవుతున్నాయనేది బహిరంగ రహస్యం. ఓ ఎమ్మెల్యే ఓ సీనియర్ మంత్రితో బాహబాహీకి దిగిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మంత్రితో గొడవకు దిగిన ఎమ్మెల్యే బయటకు వెళ్లి పలువురు సీనియర్లతో పార్టీ మారుదామనే చర్చ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ముందుకు సాగలేదు.
పాలమూరు ఉమ్మడి జిల్లా పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఇద్దరు మంత్రులు చెరో ఎమ్మెల్యేను చేరదీసి విభేదాలను మరింత రెచ్చగొట్టినట్లు సీఎంకు ఫిర్యాదు అందింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓ మున్సిపాలిటీలో టికెట్ల గొడవతో ఓ ప్రజాప్రతినిధి రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే ఒక నియోజకవర్గం పరిధిలో మరో ఎమ్మెల్యే కల్పించుకోవడం, తన అనుచరులంటూ అలకపాన్పు ఎక్కడం, మంత్రులు సహాకరిస్తున్నారంటూ ఆరోపణలు చేసుకున్నారు. సర్దుబాటుకు ఏకంగా పై స్థాయి నుంచి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్నా మళ్లీ విభేదాలు వచ్చినట్లు చర్చ జరుగుతోంది.
ఉత్తర తెలంగాణలోని ప్రధానమైన మరో జిల్లాలో కూడా ఎమ్మెల్యేలతో మంత్రికి సయోధ్య లేదని ప్రచారం జరరుగుతోంది. అంతేకాకుండా మంత్రికి జిల్లా ఉన్నతాధికారులకు మధ్య కూడా పొసగడం లేదని ప్రగతి భవన్‌కు ఫిర్యాదులందాయి. సదరు మంత్రిని అధికారులతో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ అయినట్లు సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల పనితీరు నివేదిక సిద్ధమైనట్లు సమాచారం. దీనిపై త్వరలోనే జిల్లాల వారీగా సీఎం కేసీఆర్ సమీక్షించే అవకాశం ఉంది. మరోవైపు కార్పొరేషన్ పదవులు భర్తీ చేయకపోవడంపై కూడా సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ఈ వివరాల ద్వారా వెల్లడైనట్లు సమాచారం. విడతలవారీగా వారిని పిలుపించుకుని మాట్లాడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొంతమంది నేతలు మంత్రుల దగ్గర మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. వరంగల్ జిల్లాలో ఉద్యమం నుంచి ముందువరుసలో నిలిచిన ఓ నేతకు ఇప్పుడు ప్రాధాన్యత లేదంటూ పలువురు మంత్రికి విన్నవించారు. ఇలాంటి అసంతృప్తులన్నీ సీఎం దగ్గరకు చేరినట్లు తెలుస్తోంది. అసంతృప్తితో ఉన్న నేతలకు ఈ కొద్దికాలంలోనే మంచి రోజులు వస్తాయనే సంకేతం క్రిందిస్థాయిలో ఒక మేరకు చేరింది.
జిల్లాల్లో గ్రూపులు..
– ఒక మంత్రి భూ వివాదాలు అధికార పార్టీకి రోజు రోజుకూ తలనొప్పిగా మారుతున్నాయి. స్వయంగా ఓ ఎమ్మెల్సీ మంత్రిని కలిసి ఇబ్బంది పెడుతున్నాడంటూ ఇంకో మంత్రి గురించి మొరపెట్టుకున్నాడు.
– ఓ మంత్రి అధికారులతో సయోధ్యగా ఉండటం లేదు. ఆయనతో పడలేదని కొద్ది నెలల కిందటే కలెక్టర్‌ను బదిలీ చేసినా ఇంకా కొంతమంది ఉన్నతాధికారులతో అదే పరిస్థితి ఉంది. అధికారులతో తరచూ తేడాలొస్తున్నాయి.
-ఓ సీనియర్ మంత్రిపై ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఇద్దరు ఐఏఎస్‌లు సీఎంకు ఫిర్యాదు చేశారు. కొన్ని లావాదేవీల్లో అధికారులను ఇబ్బందులు పెడుతున్నారంటూ ఒకటి రెండు భూ వివాదాలను సీఎంకు చూపించినట్లు సమాచారం.
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పార్టీ అధినేతలపైనే తిరుగబడే విధంగా వ్యవహరిస్తున్నాడు. ఓ విషయంలో ఏకంగా ఏ మంత్రితో లొల్లి పెట్టుకున్నాడు. ప్రతిపక్ష పార్టీల నేతలతో రహస్య మంతనాలు చేస్తున్నాడు.
– మరో ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ నేతలతో అంటకాగుతున్నాడు. ఇటీవల భూ వివాదాల్లో ఎంపీ రేవంత్ రెడ్డికి ఉప్పందించింది సదరు ఎమ్మెల్యేనే.
– ఇటీవల పదో తరగతి పరీక్షలు రద్దుచేసి, అందరినీ పాస్ చేయించినట్లు ప్రకటించిన సీఎం కనీసం తమతో చర్చించలేదు. సమీక్షకు కూడా పిలువలేదు. ఉద్యోగ సంఘాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఇలాంటి విషయాల్లో కూడా మమ్మల్ని పట్టించుకోకుంటే ఎలా? అసలే పంతుళ్లు ప్రభుత్వంపై పీకల్లోతు వ్యతిరేకతతో ఉన్నారు. వారికి సర్దిచెప్పాలంటే తలప్రాణం తోకకు వస్తుంది. పెద్దాయనకు చెప్పుదామంటే సమయం దొరకదు. ఇప్పుడేం చేయాలి?
– ఓ ఉమ్మడి జిల్లాలో మిషన్ భగీరథ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థ మంత్రిపై ఫిర్యాదు చేసింది. తమ్ముడితో మాట్లాడు అంటూ నెలకోసారి, పక్షం రోజులకోసారి ఇబ్బంది పెడుతున్నాడని, పార్టీ పనులు, లాక్‌డౌన్ నేపథ్యంలో వారికీ వీరికీ సాయం చేయాలి, పంచి పెట్టాలంటూ తమపై భారం పెడుతున్నారంటూ ప్రగతి భవన్ పెద్దలకు మొర పెట్టుకున్నారని గుసగుసలు విన్పిస్తున్నాయి. దీనిపై ప్రగతిభవన్‌లోని ఓ అధికారి సదరు మంత్రికి ఈ ఫిర్యాదు సమాచారాన్ని చేరవేశారని తెలుస్తోంది.