తుమ్మడం ఆపితే.. ప్రమాదమే!

దిశ వెబ్‌డెస్క్: సీన్ 1 రాజు ఆఫీస్‌కు లేట్ అవుతుందనే తొందరలో ఉన్నాడు. మెట్రో రైల్ రాగానే.. అందులోకి ఎక్కాడు. కొద్ది నిముషాల్లోనే.. బిగ్గరగా తుమ్మాడు.. అంతే ! ఒక్కసారిగా అందరూ.. అదేదో దేశద్రోహం చేసినట్లుగా అతడే వైపే కోపంగా చూశారు. సీన్ 2 మహారాష్ర్ట, కొల్హాపూర్‌ పట్టణంలోని గుజరాయి ఏరియాలో ఓ యువకుడు తన బైక్‌పై వెళ్తున్నాడు. ప్రయాణిస్తూనే రోడ్డుపై తుమ్మాడు. దీంతో ఆ యువకుడిని మరో వ్యక్తి ఆపి.. బహిరంగ ప్రదేశంలో ఎందుకు తుమ్మావ్‌? […]

Update: 2020-03-21 05:31 GMT

దిశ వెబ్‌డెస్క్:
సీన్ 1
రాజు ఆఫీస్‌కు లేట్ అవుతుందనే తొందరలో ఉన్నాడు. మెట్రో రైల్ రాగానే.. అందులోకి ఎక్కాడు. కొద్ది నిముషాల్లోనే.. బిగ్గరగా తుమ్మాడు.. అంతే ! ఒక్కసారిగా అందరూ.. అదేదో దేశద్రోహం చేసినట్లుగా అతడే వైపే కోపంగా చూశారు.

సీన్ 2
మహారాష్ర్ట, కొల్హాపూర్‌ పట్టణంలోని గుజరాయి ఏరియాలో ఓ యువకుడు తన బైక్‌పై వెళ్తున్నాడు. ప్రయాణిస్తూనే రోడ్డుపై తుమ్మాడు. దీంతో ఆ యువకుడిని మరో వ్యక్తి ఆపి.. బహిరంగ ప్రదేశంలో ఎందుకు తుమ్మావ్‌? అని ప్రశ్నించాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో జాగ్రత్తలు తీసుకోవా? చేతి రుమాలు అడ్డం పెట్టుకుని తుమ్మొచ్చు? కదా అంటూ అతనితో వాదించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వాహనదారులంతా గుమిగూడారు. ఇంతలోనే తుమ్మిన వ్యక్తిని మరో వ్యక్తి కొట్టాడు.

తుమ్ము వచ్చినా.. దగ్గు వచ్చినా ఆపుకోలేం ! అలా ఆపుకోవడం కూడా సబబు కాదు. కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచీ తుమ్మేవాళ్లను జనాలు వింతగా చూస్తుండటంతో.. తుమ్ము వచ్చినా సరే, ఆ జనాలకు భయపడి చాలా మంది తుమ్మకుండా ఉండిపోతున్నారు. తుమ్మితే.. చుట్టుపక్కల వాళ్లు.. ఎక్కడ కరోనా సోకిందనుకుంటారో ! అని, తుమ్ము వచ్చినా.. బలవంతంగా ఆపుకుంటున్నారు. కానీ తుమ్ము వచ్చినప్పుడు ఆపొద్దని, తుమ్మితేనే బెటరని డాక్టర్లు అంటున్నారు. తుమ్ము వస్తే.. మోచేతిని అడ్డం పెట్టుకుని తుమ్మండని వైద్యులు, పోలీసులు, సినీ తారలు ఇలా ఎంతోమంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ చాలామంది ప్రజలు తుమ్మడానికి జంకుతున్నారు.

తుమ్ముకు బ్రేక్ వేస్తే ఏమవుతుంది?

‘తుమ్ము’ పునర్జన్మ అని పెద్దలు చెబుతుంటారు. అందుకే చిన్న పిల్లలు తుమ్మినప్పుడు చిరంజీవా అంటారు. అదంతా పక్కనబెడితే, తుమ్మును బలవంతంగా ఆపినట్టయితే.. చెవిలోని డయాఫ్రమ్ దెబ్బతిని చెవుడు వచ్చే ప్రమాదముంది. అంతేకాక కళ్లల్లోని రక్త నాళాలు దెబ్బతినడంతో పాటు కంట్లోని తెల్ల పొరపై ఐరిస్ చుట్టూ రక్తనాళాలు బ్రేక్ అవుతాయి. బ్రెయిన్‌లోని రక్త నాళాలు బలహీనంగా మారిపోతాయి. తుమ్మినప్పుడు మన గుండె ఒక సెకను కాలం పాటు ఆగిపోతుంది. దాన్ని ఆపుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. తుమ్ము వల్ల చాలా శక్తివంతమైన గాలి(గంటకు వంద మైళ్ల వేగం) శరీరం నుంచి ముక్కు, నోటి ద్వారా బయటకు వస్తుంది. దాన్ని ఆపితే.. అది శరీరంలోని అంతర్గత భాగాలపై ప్రతి చర్య చూపెడుతుంది. తుమ్ములోని గాలి బుడగలు గుండె, మెదడు కణజాలాల్లోకి ప్రవేశించి వెంటనే చనిపోయే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

చావు అంచులా దాకా వెళ్లాడు..

లండన్‌లో ఓ 34 ఏళ్ల వ్యక్తి.. తుమ్మును ఆపేందుకు ముక్కు రంధ్రాలు, నోరు ఒకేసారి మూసుకున్నాడు. దీంతో అతడి గొంతు మధ్య అంతర్గతంగా రంధ్రం ఏర్పడింది. గొంతు కూడా బాగా వాచిపోవడంతో.. బాధితుడు వైద్యులను సంప్రదించాడు. సీటీ స్కాన్‌లో అతని గొంతు లోపలి భాగం చిధ్రమైనట్లు గుర్తించారు. గాలి బుడగలు గుండె కండరాలు, కణజాలాల్లోకి చేరాయి. దీనివల్ల ప్రాణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని గుర్తించి వెంటనే అతనికి చికిత్స అందించారు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత అతను కోలుకున్నాడు.

ఎందుకు తుమ్ముతాం?

మన శరీరానికి పడని బ్యాక్టీరియా, క్రిములు లోపలికి వస్తే… తుమ్మడం ద్వారా శరీరం దాన్ని బయటకు పంపేస్తుంది. తుమ్మును ఆపేస్తే ఆ బ్యాక్టీరియా లేదా వైరస్ ముక్కులోనే ఉండిపోతుంది. కాసేపటి తర్వాతైనా మళ్లీ దాన్ని బయటకు పంపేందుకు ముక్కు ప్రయత్నిస్తుంది.
అందువల్ల తుమ్ము వస్తే.. భయపడకుండా తుమ్మండి. కానీ తుమ్మేప్పుడు మోచేతిని అడ్డుపెట్టుకోవడం మరవకండి.

Tags:    

Similar News