ఇండియన్ హిస్టరీ: శాసనోల్లంఘన ఉద్యమం (గ్రూప్స్/ఎస్సై, కానిస్టేబుల్ ప్రత్యేకం)
గాంధీ నాయకత్వంలో ప్రారంభమైన రెండో అతిపెద్ద ప్రజా పోరాటం శాసనోల్లంఘన ఉద్యమం.
గాంధీ నాయకత్వంలో ప్రారంభమైన రెండో అతిపెద్ద ప్రజా పోరాటం శాసనోల్లంఘన ఉద్యమం.
1927 బ్రిటీష్ ప్రభుత్వం సైమన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రకటన చేసింది.
1919 రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించుటకు గాను నియమించబడిన కమిషన్ నిర్ణీత గడువు కన్నా ముందుగానే నియమించబడటం భారత రాజకీయ పార్టీలలో అనుమానాలకు దారి తీసింది. కమిషన్‌లో 7 మంది సభ్యులు ఆంగ్లేయులే కావడం అభ్యంతరకరమైంది.
జస్టిస్ పార్టీ, కొన్ని దిగువ కులాలు తప్పించి మిగిలిన రాజకీయ పార్టీలన్నీ సైమన్ కమిషన్ వ్యతిరేకించాలని తీర్మానించాయి.
సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా మద్రాస్‌లో టంగుటూరి ప్రకాశం, లాహోర్‌లో లాలా లజపతిరాయ్ గొప్ప ప్రదర్శనలు నిర్వహించారు.
పోలీసుల లాఠీ చార్జ్‌కి గురై లాలా లజపతిరాయ్ మరణించడంతో భారత జాతీయ భావాలు మరింత ప్రభావితమయ్యాయి.
ఆర్థిక మాంద్యం ప్రభావం వలన భారతదేశంలో సంక్షోభం ఏర్పడింది.
రైతాంగ సమస్యల పట్ల సర్ధార్ వల్లబాయ్‌పటేల్ బార్డోలి సత్యాగ్రహానికి పూనుకున్నాడు.
ఫలితంగా రైతాంగంలో ఉద్యమ చైతన్యం చోటుచేసుకుంది. సైమన్ కమిషన్ పర్యటనను రాజకీయ పార్టీలు బహిష్కరించడాన్ని సెక్రటరీ స్టేట్ ఫర్ ఇండియా లార్డ్ బెర్కిన్ హెడ్ తప్పుపట్టాడు. అన్ని రాజకీయ పార్టీలకు ఆమోద యోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని సవాలు చేశాడు.
ఫలితంగా అన్ని రాజకీయ పార్టీలతో కూడిన అఖిలపక్షం రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యతను మోతిలాల్ నెహ్రూ కమిటీ అను ఉప సంఘానికి అప్పగించారు.
మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికలో ముస్లింలకు మతపరమైన నియోజక వర్గాలకు బదులు సాధారణ నియోజకవర్గాలలోని 1/౩ వంతు స్థానాలను కేటాయించింది.
నివేదికను తిరస్కరిస్తూ ముస్లింలీగ్ నాయకుడైన జిన్నా 14 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టాడు.
నివేదికను అమలు చేసి తీరాలని పట్టుబడుతూ కాంగ్రెస్ డిసెంబర్ 31, 1929 తుది గడువు పెట్టింది.
గవర్నర్ జనరల్ ఇర్విన్ దీపావళి ప్రకటన చేస్తూ రాజ్యాంగ సంస్కరణలపై లండన్‌లో జరగబోయే రౌండ్ టేండ్ సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధం కావాలని ప్రతిపాదన చేశాడు.
ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించడంతో ప్రతి స్తంభన ఏర్పడింది.
1929 డిసెంబర్‌లో జరిగిన లాహోర్ సమావేశంలో పూర్ణస్వరాజ్యం తీర్మానం చేయడంతో ఉద్యమం అనివార్యమైంది.
ఈ సమావేశంలోనే ప్రతి ఏడాది జనవరి 26 స్వాతంత్ర దినంగా పాటించాలని తీర్మానించారు.
అలాగే త్రివర్ణ పతాకం ఎగుర వేశారు.
1930 ఫిబ్రవరిలో గాంధీ ఇర్విన్‌ను కలిసి 11 డిమాండ్‌లను ప్రవేశపెట్టారు. గాంధీ చేసిన ప్రయత్నం విఫలమవడంతో ఉద్యమం అనివార్యమైంది.
ఉద్యమ గమనం:
మార్చి 12, 1930 న గాంధీ 78 మంది అనుచరులతో సబర్మతి నుండి దండికి బయలుదేరాడు.
ఏప్రిల్ 6న గాంధీ చట్టాన్ని ఉల్లంఘించి ఉప్పు తయారు చేయడంతో ఉద్యమం ప్రారంభమైంది.
మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజాజీ నాయకత్వంలో తిరుచురాపల్లి నుండి తిండివనం వరకు ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు.
బాంబే ప్రెసిడెన్సీలో వడాల, దర్శన అను ప్రాంతాల వద్ద సరోజిని నాయుడు, విఠల్‌భాయ్ పటేల్‌లు ఉప్పు సత్యాగ్రహాలు నిర్వహించారు.
ఉద్యమంలో స్వాతంత్య్ర పోరాటం తొలిసారిగా సరిహద్దులు దాటి ఆఫ్ఘానిస్తాన్ లో ప్రవేశించింది.
సరిహద్దు గాంధీగా పిలువబడిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ దైవ సేవకుల సంఘం, ఎర్రచొక్కాలు అను స్వచ్ఛంద సంస్థలను స్థాపించాడు.
ఉద్యమంలో భాగంగా విప్లవ కార్యకలాపాలు బలపడ్డాయి. హిందుస్తాన్ పీపుల్స్ రిపబ్లికన్ ఆర్మీకి వ్యవస్థాపకుడైన సూర్య సేన్ చిట్టగాంగ్ ఆయుధ కర్మాగారంపై దాడి చేశాడు.
కాంగ్రెస్ పార్టీ పాల్గొనకుండానే రౌండ్‌టేబుల్ సమావేశాలు ప్రారంభ మయ్యాయి.
మెజారిటీ పార్టీ కాంగ్రెస్ లేకుండా ఏ నిర్ణయం సాధ్యం కాదని గ్రహించిన తేజ్ బహదూర్, ఎంఆర్ జయకర్‌లు గాంధీ ఇర్విన్‌లకు మధ్య మధ్యవర్తిత్వం చేసి గాంధీ ఇర్విన్ ఒప్పందం చేశారు.
ఒప్పందం అనుసరించి గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతినిధిగా రెండవ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు.
ముస్లింలీగ్, హిందూ మహాసభ, డా.బిఆర్ అంబేద్కర్‌ల నుండి విమర్శలు ఎదుర్కొన్నాడు.
రాజ్యాంగ సంస్కరణలపై ప్రతిష్టంబన కొనసాగడంతో గాంధీ సమావేశం నుండి నిష్క్రమించాడు.
భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీ ఉద్యమాన్ని పునరుద్ధరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గాంధీని నిర్భందించడంతో ఉద్యమం ముగిసింది.
ఉద్యమ సమీక్ష:
ఉద్యమం కొన్ని వైఫల్యాలను చవి చూసింది. ఉద్యమ వైఫల్యం వల్ల కార్మిక కర్షక వర్గాలు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు.
కర్షకులు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు. ఫలితంగా ఆచార్య ఎన్‌జీ రంగా ప్రేరణతో 1936 నాటికి అఖిలభారత కిసాన్ మహాసభ ఏర్పడింది.
ఉద్యమ వైఫల్యం కార్మికులను నిరాశకు గురి చేసింది.
కాంగ్రెస్‌కు అనుబంద ట్రేడ్ యూనియన్ అయిన ఎఐటియూసి లో కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గి కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరిగింది.
ఉద్యమ వైఫల్యం పరోక్షంగా కాంగ్రెస్‌లో సోషలిస్ట్ భావాలు బలపడుటకు, కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఆవిర్భావానికి దారితీసింది.
ఆచార్య నరేంద్ర దేవ్, జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో 1934 బాంబే సమావేశంలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ స్థాపించారు.
జె.ఎల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి అగ్ర నాయకులు కూడా గాంధేయ వాదం పట్ల విశ్వాసాన్ని కోల్పోయారు.
క్రమంగా సామ్యవాదం వైపు మొగ్గు చూపారు. ఉద్యమంతో భారత స్వాతంత్య్ర పోరాట పరిధి విస్తరించబడింది. ఉద్యమ భావాలు సరిహద్దులు దాటి ఆఫ్ఘానిస్తాన్‌లోకి ప్రవేశించింది.
తన దండి సత్యాగ్రహం ద్వారా గాంధీ స్వదేశీ వనరులు స్వదేశీయులకు ఉపయోగపడాలని సమర్ధవంతంగా చాటి చెప్పారు.
ఉద్యమంలో కాంగ్రెస్ స్వభావంలో స్పష్టమైన మార్పు చోటుచేసుకుంది.
స్వయం పరిపాలనకు బదులు పూర్ణ స్వాతంత్య్రాన్ని తన ధ్యేయంగా ప్రకటించడంతో కాంగ్రెస్ పోరాట పంథా, ధోరణిలో మార్పులు వచ్చాయి.