ఆన్‌లైన్ తరగతులు అర్థమవట్లే..!

దిశ ప్రతినిధి, ఖ‌మ్మం : ఎట్టకేల‌కు పాఠ‌శాల‌ల‌కు విద్యార్థులు రాకుండానే విద్యాసంవ‌త్సరం ప్రారంభ‌మైపోయింది. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండి నెట్టిల్లు వేదికగా పాఠాలు నేర్చుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌, డిజిట‌ల్ త‌ర‌గ‌తుల‌ను రాష్ట్ర విద్యాశాఖ ప్రారంభించింది. ఆన్‌లైన్ చ‌దువుల‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ క‌స‌ర‌త్తు చేసిన‌ట్లుగా క‌న‌బ‌డినా.. ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల‌కు తెలుగులో పాఠాలు బోధించ‌డమేంటో అర్థం కావ‌డం లేద‌ని త‌ల్లిదండ్రులు విమ‌ర్శిస్తున్నారు. ఖ‌మ్మం, భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మంగ‌ళ‌వారం ఆన్‌లైన్‌, డిజిట‌ల్ త‌ర‌గ‌తులు నానా అవ‌స్థలు, అస‌మ‌గ్రత […]

Update: 2020-09-01 21:11 GMT

దిశ ప్రతినిధి, ఖ‌మ్మం :

ఎట్టకేల‌కు పాఠ‌శాల‌ల‌కు విద్యార్థులు రాకుండానే విద్యాసంవ‌త్సరం ప్రారంభ‌మైపోయింది. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండి నెట్టిల్లు వేదికగా పాఠాలు నేర్చుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌, డిజిట‌ల్ త‌ర‌గ‌తుల‌ను రాష్ట్ర విద్యాశాఖ ప్రారంభించింది. ఆన్‌లైన్ చ‌దువుల‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ క‌స‌ర‌త్తు చేసిన‌ట్లుగా క‌న‌బ‌డినా.. ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల‌కు తెలుగులో పాఠాలు బోధించ‌డమేంటో అర్థం కావ‌డం లేద‌ని త‌ల్లిదండ్రులు విమ‌ర్శిస్తున్నారు. ఖ‌మ్మం, భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మంగ‌ళ‌వారం ఆన్‌లైన్‌, డిజిట‌ల్ త‌ర‌గ‌తులు నానా అవ‌స్థలు, అస‌మ‌గ్రత మ‌ధ్యే కొన‌సాగాయి. కొద్దిరోజులుగా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించారు. చాలామంది విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి సానుకూల స్పంద‌న వ‌చ్చింది.

మంగ‌ళ‌వారం కొవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూనే ఉపాధ్యాయులు నిర్ధిష్ఠ స‌మయానికే పాఠ‌శాల‌ల్లో త‌మ విధుల‌కు హాజ‌ర‌య్యారు. అలాగే కొంత‌మంది విద్యార్థుల‌కు నేరుగా ఫోన్ చేసి మాట్లాడ‌టం క‌నిపించింది. ముంద‌స్తుగానే ఆయా త‌ర‌గ‌తుల వారీగా వాట్సాప్ గ్రూపుల‌ను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో, డిజిట‌ల్ బోధ‌న త‌ర్వాత ముఖ్యమైన అంశాల‌పై వాట్సాప్ గ్రూపుల్లో వివ‌ర‌ణ ఇవ్వడం క‌నిపించింది. ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలోని ఆయా పాఠ‌శాల‌ల‌ను స్థానిక ప్రజాప్రతినిధులు, త‌హ‌సీల్దార్లు సంద‌ర్శించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల‌తో విద్యార్థుల‌తో స‌మ‌న్వయంపై ఆరా తీశారు. అయితే ఉపాధ్యాయుల నుంచి భిన్నాభిప్రాయాలు రావడం గ‌మ‌నార్హం. టూకీగా త‌ర‌గ‌తుల నిర్వహ‌ణ త‌ప్పా.. విద్యార్థుల‌కు పెద్దగా ఒరిగేదేమీ లేద‌ని కొంత‌మంది ఉపాధ్యాయులే పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఏర్పాట్లు ప‌ర్వాలేదు.. వేధించిన సిగ్నల్స్

టీవీ దూరదర్శన్‌, టీషాట్‌ ఛానళ్ల ద్వారా ఆన్‌లైన్‌ విద్యను బోధిస్తూ ప్రణాళికను రూపొందించి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఖమ్మం కలెక్టర్‌ కర్ణన్, భ‌ద్రాద్రి జిల్లా క‌లెక్టర్ ఎంవీరెడ్డి ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు ఆన్‌లైన్‌ క్లాస్‌ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. టీవీ, స్మార్ట్ ఫోన్ లేనివారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రసార మాధ్యమాలు లేని వారి కోసం పాఠశాల, గ్రామ పంచాయతీ టీవీలకు ఆన్‌లైన్‌ను సమకూర్చారు. అయితే టీవీ, సెల్‌ఫోన్ లేని విద్యార్థులు బ‌హు త‌క్కువ‌గా ఉన్నార‌ని, మొత్తంలో 5 శాతానికి కూడా మించ‌లేద‌ని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. అయితే నెట్ సిగ్నల్ ప్రాబ్లంతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల ఆన్‌లైన్ క్లాసుల‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

వాట్సాప్‌లో సందేహాలు నివృత్తి… బోన‌క‌ల్ హైస్కూల్‌

మధిర : మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఆన్‌లైన్, డిజిట‌ల్‌ క్లాసులు మంగ‌ళ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో విద్యార్థులు ఇళ్ల నుంచే పాఠాలు నేర్చుకున్నారు. ఇదిలా ఉండ‌గా దిశ మంగ‌ళ‌వారం ఉద‌యం బోన‌క‌ల్ మండ‌ల‌ కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌ను సంద‌ర్శించింది. బోన‌క‌ల్ ప్రభుత్వ హైస్కూల్‌లో 12 మంది ఉపాధ్యాయులు ప‌నిచేస్తుండ‌గా అంద‌రూ విధుల‌కు హాజ‌ర‌య్యారు. ఉపాధ్యాయులు నిర్ధిష్ఠ స‌మ‌యానికే పాఠ‌శాల‌కు చేరుకున్నారు. కొవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను పాటిస్తూనే త‌మ విధుల‌ను కొన‌సాగించారు.

త‌ర‌గ‌తుల వారీగా విద్యార్థుల‌కు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల్లో ఉపాధ్యాయులు స‌మ‌న్వయం చేస్తూ వారి సందేహాల‌ను తీర్చే ప్రయ‌త్నం క‌నిపించింది. అయితే చాలా మంది విద్యార్థులు త‌మ సందేహాలు తీర‌డం లేద‌ని వాపోతున్నార‌ని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మొత్తం పాఠ‌శాల‌లో 208 మంది విద్యార్థులున్నార‌ని హెడ్‌మాస్టర్ ర‌త్నకుమారి తెలిపారు. ముందురోజే గ్రామంలో డ‌ప్పు చాటింపు చేసి త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇచ్చామని తెలిపారు. మొత్తం విద్యార్థుల్లో ఏడుగురికి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేక‌పోవ‌డంతో సీఆర్పీల ద్వారా టీవీల్లో పాఠాలు వినేలా ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు.

లోపించిన స‌మ‌గ్రత‌.. అర్థం కాకుంటే అంతే..

పాలేరు : ఆన్‌లైన్‌, డిజిట‌ల్ త‌ర‌గ‌తుల ప్రారంభాన్ని పుర‌స్కరించుకుని కూసుమంచి మండ‌లం మ‌ల్లేప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌ను ‘దిశ’ చేసింది. పాఠ‌శాల‌లో ప‌నిచేస్తున్న 17 మంది విధుల‌కు హాజ‌ర‌య్యారు. ఆరు నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు పాఠ‌శాల‌లో 221 మంది విద్యార్థులు చ‌దువుకుంటుండ‌గా ఐదుగురికి మిన‌హా మిగ‌తా వారంద‌రికీ స్మార్ట్‌ఫోన్‌, టీవీ సౌక‌ర్యం ఉంది. ఐదుగురికి వారి బంధువులు, చుట్టు ప‌క్కల వారికి చెప్పి పాఠాలు వినేలా ఏర్పాట్లు చేసిన‌ట్లు పాఠ‌శాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు.

అర్థం కాని వారికి రిపీటెడ్‌గా వినే అవ‌కాశం లేక‌పోవ‌డం కొంత ఇబ్బందిగా మారింద‌ని త‌ల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వ‌ర్క్‌షీట్ల ద్వారా విద్యార్థుల‌కు అర్థమైంది లేనిది తెలుసుకునే ప్రయ‌త్నం చేస్తున్నారు. అయితే ఇందులో స‌మ‌గ్రత ఉండ‌టం క‌ష్టమ‌ని వారే చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News