పార్టీల చూపు.. యువత వైపు

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఉప పోరులో అన్ని పార్టీలు యువత వైపు చూస్తున్నాయి. ప్రచార గడువు సమీపిస్తున్నా కొద్దీ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది యువతే కావడంతో యువతను తమ పార్టీలో చేర్చుకుంటే కొన్ని ఓట్లు అయినా పెరుగుతాయనేది ఆయా పార్టీల ఆశ. అందుకోసం యువతను తమ పార్టీలో చేర్చుకొనే పనిలో నిమగ్నమై […]

Update: 2020-10-30 22:31 GMT

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఉప పోరులో అన్ని పార్టీలు యువత వైపు చూస్తున్నాయి. ప్రచార గడువు సమీపిస్తున్నా కొద్దీ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది యువతే కావడంతో యువతను తమ పార్టీలో చేర్చుకుంటే కొన్ని ఓట్లు అయినా పెరుగుతాయనేది ఆయా పార్టీల ఆశ. అందుకోసం యువతను తమ పార్టీలో చేర్చుకొనే పనిలో నిమగ్నమై విద్యార్థి, యువజన నాయకులను రంగంలోకి దింపి జోరుగా ప్రచారం చేస్తున్నాయి. యువతను ఆకట్టుకునేలా భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు కరువయ్యాయని నిరుద్యోగ యువతీయువకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. వారిని కూల్ చేసేందుకు మంత్రి తన్నీరు హరీశ్ రావు తంటాలు పడుతుండగా, ప్రత్యర్థులు దానినే ప్రధాన అస్త్రంగా చేసుకొని యువతను తమవైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేసేది యువతేనని ఆయా పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. అందుకు అభ్యర్థులంతా యువ ఓటర్లపై దృష్టి సారించారు. నియోజకవర్గంలో 18-25 ఏండ్ల వయస్సు ఉన్న యువతీ, యువకులు 10 శాతం మంది ఉన్నారు. మొత్తం 1,97,468 ఓటర్లు కాగా ఇందులో సుమారు 20 వేల వరకు యువత ఓట్లే ఉన్నాయి. ఎన్నికల వేళ ఆయా పార్టీలకు ప్రతి ఓటూ కీలకమే. అందుకోసం యువ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. వారిని ఆకట్టుకునేలా భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. సగానికిపైగా యువత బీజేపీ వైపు ఉండగా, వారిని టీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు మంత్రి హరీశ్ రావు ముప్పుతిప్పలు పడుతునట్లు తెలుస్తోంది.

విద్యార్థి, యువజన సంఘాల ప్రచారం..

నియోజకవర్గంలో యువత ఓటర్లను తమ ఖాతాలో వేసుకునేందుకు ఆయా పార్టీలు విద్యార్థి, యువజన సంఘాల నాయకులను రంగంలోకి దింపాయి. ఈ మధ్య కాలంలో ప్రతి పార్టీకి అనుబంధంగా విద్యార్థి, యువజన సంఘాలు ఏర్పడ్డాయి. టీఆర్ఎస్‌కు టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్ యువజన సంఘం, బీజేపీకి బీజేవైఎం, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, భజరంగదల్, కాంగ్రెస్‌కు ఎస్ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ సంఘలు ఉన్నాయి. యువతను ఆకర్షించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువజన సంఘాల నాయకులను పిలిపించుకొని ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు. రంగంలోకి దిగిన ఆ నాయకులు యువతతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వారికి కావాల్సిన ఆట వస్తువులు, కిట్లు ఇస్తూ జిమ్ములు ఏర్పాటు చేస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు.

టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నిరుద్యోగ యువత!

రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అంతా టీఆర్ఎస్ పార్టీపై అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దుబ్బాకలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. నియోజకవర్గంలో దాదాపు ఇంటికో నిరుద్యోగి ఉన్నారు. వారంతా డీఈడీ, బీఈడీ పూర్తి చేసి నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో చాలా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో చాలా మంది నిరుద్యోగులు నిరాశలో ఉన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో హైదరాబాద్, పటాన్‌చెరు లాంటి పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఏళ్లకొద్దీ వివిధ కోచింగ్‌లకు వేల రూపాయలు ఖర్చుపెట్టి ఏ పని లేకుండా ఉండడం వారికి ప్రభుత్వంపై కోపం తెప్పిస్తోంది. దాంతో ఈ ఎన్నిక ఫలితాల ద్వారా సర్కారుకు ఓటమి రుచి చూపించి తమ నిరసన తెలియజేయాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News