నిబంధనలా.. నిర్బంధమా.. తేల్చుకోమన్న కర్నాటక సీఎం

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే పలు ప్రాంతాలలో లాక్‌డౌన్ విధించగా మధ్యప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాలలో రాత్రిపూట కర్ఫ్యూను అమలుచేస్తున్నారు. కర్నాటకలోనూ కొవిడ్ కేసుల సంఖ్య చాప కింద నీరులా పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించారు. కొవిడ్-19 మార్గదర్శకాలను ప్రజలందరూ తూచా తప్పకుండా పాటించాలని ఆయన ప్రజలను కోరారు. నిబంధనలు పాటించకుంటే గతేడాది విధించిన మాదిరిగా నిర్బంధ లాక్‌డౌన్ తప్పకపోవచ్చునని ఆయన […]

Update: 2021-03-15 21:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే పలు ప్రాంతాలలో లాక్‌డౌన్ విధించగా మధ్యప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాలలో రాత్రిపూట కర్ఫ్యూను అమలుచేస్తున్నారు. కర్నాటకలోనూ కొవిడ్ కేసుల సంఖ్య చాప కింద నీరులా పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించారు. కొవిడ్-19 మార్గదర్శకాలను ప్రజలందరూ తూచా తప్పకుండా పాటించాలని ఆయన ప్రజలను కోరారు. నిబంధనలు పాటించకుంటే గతేడాది విధించిన మాదిరిగా నిర్బంధ లాక్‌డౌన్ తప్పకపోవచ్చునని ఆయన హెచ్చరించారు.

కర్నాటకలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో సోమవారం ఆయన వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ.. ప్రజలందరూ కొవిడ్-19 మార్గదర్శకాలను విధిగా పాటించాలని కోరారు. ఫంక్షన్లు, మతపరమైన వేడుకలు చేసుకునేవాళ్లు 500 మందికి మించి గుమిగూడకుండా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. పబ్లిక్ ప్లేసులలో మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. ‘వారం రోజుల పాటు చూస్తాం. ప్రజలు విధిగా మాస్కులు ధరిస్తూ, సోషల్ డిస్టాన్స్ పాటించాలి. ఒకవేళ ప్రజలు సహకరించకుంటే రూ. 250 జరిమానా విధిస్తాం. ఆ పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత ప్రజలదే. రాష్ట్రంలో మరో లాక్‌డౌన్ రాకుండా ఉండాలంటే ఈ నిబంధనలను విధిగా పాటించాలి’ అని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై యడియూరప్ప స్పందిస్తూ.. కర్నాటకలో రోజూ 1.5 లక్షల మందికి టీకాలు వేస్తున్నామని.. రానున్న రోజుల్లో దానిని రెట్టింపు చేస్తామని అన్నారు. గడిచిన మూడు రోజులుగా రాష్ట్రంలో 900 కు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. బీదర్, కల్బుర్గి, బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, ఉడిపి, దక్షిణ కన్నడ జిల్లాల నుంచే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కర్నాటకకు సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్ర, కేరళలో కేసులు పెరుగుతున్న తరుణంలో ఆ రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లు ఆర్టీపీసీఆర్ రిపోర్టులను తీసుకురావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News