సంయమనం పాటించండి.. వారిపై కఠిన చర్యలు
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : భైంసాలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారని, ప్రజలు సంయమనం పాటించాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. ఎవరూ రెచ్చగొట్టేలా ప్రవర్తించినా ఇరు వర్గాలు సంయమనం పాటించాలని సూచించారు. సాధారణ ప్రజలకు నష్టం కలిగేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరు ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా నిగ్రహంగా ఉండాలని, పుకార్లను నమ్మవద్దన్నారు. పోలీస్ యంత్రాంగానికి ప్రజలు […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : భైంసాలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారని, ప్రజలు సంయమనం పాటించాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. ఎవరూ రెచ్చగొట్టేలా ప్రవర్తించినా ఇరు వర్గాలు సంయమనం పాటించాలని సూచించారు. సాధారణ ప్రజలకు నష్టం కలిగేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరు ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా నిగ్రహంగా ఉండాలని, పుకార్లను నమ్మవద్దన్నారు. పోలీస్ యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
భైంసా అల్లర్లకు కారకులైన వారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటుమని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఘర్షణలకు దిగితే నష్టపోతారని, దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భైంసాలో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల అభివృద్ది కుంటుపడుతుందని, సామన్య, మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల వల్ల బైంసా పట్టణ ఇమేజ్ కూడా దెబ్బతింటుందన్నారు.
అలాగే యువత కేసుల్లో ఇరుక్కుని జైలు పాలైతే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు.భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం నెలకొనేలా రాజకీయ పార్టీలు, ఇరువర్గాల ప్రజలు, ఇతర నేతలు సంయమనం పాటించాల్సిన అవసరముందని చెప్పారు. సామరస్యపూర్వకంగా విబేధాలను పరిష్కరించుకుని, శాంతియుత వాతావరణం నెలకొనెలా ఇరువర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.
జర్నలిస్టులపై దాడి బాధాకరం..
భైంసాలో జర్నలిస్టులపై దాడులు జరగడం బాధాకరమని, ఇలాంటివి పునరావృతం కాకుండా నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బైంసా ఘటనలో గాయపడ్డ జర్నలిస్ట్‌లను మంత్రి ఫోన్లో పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి విజయ్ సోదరుడితో మంత్రి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇదే ఘటనలో గాయపడ్డ మరో ఇద్దరు జర్నలిస్టులు ప్రభాకర్, రవితో మంత్రి మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందని, ఎక్కడ ట్రీట్ మెంట్ తీసుకున్నారని వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, వారికి ధైర్యం చెప్పారు.