పొత్తు లేదంటరు.. ప్రచారం చేయరు

పొత్తు లేదంటరు.. పోటీనివ్వనివ్వరు. అభ్యర్థులకు అధిష్ఠానం సహకరించదు.. ప్రచారం అసలుకే చేయ్యదు. ఫలితంగా బరిలో దిగిన అభ్యర్థులు బలి అవుతున్నారు.. రూ. లక్షల్లో నష్టపోతున్నారు. అభివృద్ధి తమదేనని చెప్పుకోలేని దుస్థితిలో ఇన్‌చార్జీల పరిస్థితి. ఇదీ.. పాతబస్తీలో టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఉంటున్న విచిత్ర పోటీ. ఈ అర్థంకాని బంధంతో గులాబీ పార్టీ అభ్యర్థులు, కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు కష్టాల పాలవుతున్నారనే చర్చ ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల సందర్భంగా జోరందుకుంది. దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో టీఆర్ఎస్, ఎంఐఎం […]

Update: 2020-11-20 23:21 GMT

పొత్తు లేదంటరు.. పోటీనివ్వనివ్వరు. అభ్యర్థులకు అధిష్ఠానం సహకరించదు.. ప్రచారం అసలుకే చేయ్యదు. ఫలితంగా బరిలో దిగిన అభ్యర్థులు బలి అవుతున్నారు.. రూ. లక్షల్లో నష్టపోతున్నారు. అభివృద్ధి తమదేనని చెప్పుకోలేని దుస్థితిలో ఇన్‌చార్జీల పరిస్థితి. ఇదీ.. పాతబస్తీలో టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఉంటున్న విచిత్ర పోటీ. ఈ అర్థంకాని బంధంతో గులాబీ పార్టీ అభ్యర్థులు, కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు కష్టాల పాలవుతున్నారనే చర్చ ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల సందర్భంగా జోరందుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్యనున్న కనిపించని పొత్తు బంధంతో నాయకులు నష్టపోతున్నారు. ఎన్నికల తర్వాత డీలా పడిపోతున్నారు. ప్రతిసారీ పరోక్షంగా ఎంఐఎం పార్టీకి అధికార పక్షం సహకరిస్తూనే పలువురిని పోటీలో నిలబెడుతోంది. ఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేదని గురువారం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పాతబస్తీలోనూ 10 డివిజన్లలో తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాంటప్పుడు ఈ ఎన్నికల్లోనైనా పాతబస్తీలో అధికార పక్షం ప్రచారం చేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అభ్యర్థులకు ఆర్థికంగా నష్టమే..

పాతబస్తీలోని చార్మినార్, యాఖుత్ పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్ పురా, మలక్ పేట, కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లోని అత్యధికం డివిజన్లలో ఎంఐఎం పార్టీ ఆధిపత్యమే కొనసాగుతోంది. దశాబ్దాలుగా ఎవరూ గెలిచిన సందర్భాలు లేవు. అలాంటి ప్రాంతాల్లో అధికార పక్షం నామమాత్రంగా అభ్యర్థులను పోటీకి నిలుపుతోంది. పార్టీ కోసం నిరంతరం పని చేస్తున్న కార్యకర్తలు నామినేషన్లు దాఖలు చేసినా ప్రచారానికి మాత్రం అధిష్ఠానం కన్నెత్తి కూడా చూడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏనాడూ మంత్రుల స్థాయిలో ఎవరూ ప్రచారానికి వెళ్లలేదు. అక్కడక్కడా టీఆర్ఎస్ ప్రచారాన్ని ఎంఐఎం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. మలక్‎‎పేట నియోజకవర్గంలో ఒక మంత్రిపైనా దాడికి యత్నించిన ఉదంతాలు ఉన్నాయి. అంత జరిగినా ఆ పార్టీ వైఖరిని ఎవరూ ఖండించలేదు. అభ్యర్థులు సొంతంగా ఎంతగా ప్రచారం చేసినా ఫలితం ఉండదని తెలిసినా ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉన్నారు. అయితే పార్టీ సహకరిస్తే ఇంకొన్ని డివిజన్లలో గెలుపు కష్టమేంకాదని కొందరు కార్యకర్తలు చెబుతున్నారు. ప్రతీసారి ఉత్తుత్తిగా నిలబడడం, ప్రచారం చేయడం ఆనవాయితీగా మారింది. కానీ బరిలో నిలబడిన వారికి మాత్రం రూ.లక్షలు ఖర్చవుతున్నాయి. కనిపించని పొత్తు బంధంలో చాలా మంది నాయకులు, కార్యకర్తలు ఆర్థికంగా బలికాక తప్పడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పేరుకే ఇన్‌చార్జీలు.!

2016 బల్దియా ఎన్నికలతో పాటు ప్రస్తుతం కూడా పార్టీ తరఫున ఇన్ చార్జీలను నియమించారు. పైగా వారంతా ప్రజాదరణ ఉన్నవారే కావడం విశేషం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మేయర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పని చేస్తోన్న పలువురికి బాధ్యతలు అప్పగించారు. ఎంఐంఎం పార్టీకి వ్యతిరేకంగా ఏం మాట్లాడే అవకాశం లేదు. పెద్దగా ప్రచారం చేస్తే ఎంఐఎం పార్టీ నాయకత్వం కూడా అంగీకరించని పరిస్థితులు ఉన్నాయి. పేరుకే ఇన్‌చార్జీలుగా ఉండాలి. పాతబస్తీలో అధికార పక్షాన్ని ఆదరించే అవకాశాలు ఉన్నప్పటికీ పెద్దగా ప్రచారం చేసేందుకు అవకాశం లేదని గత ఎన్నికల్లో ఒక డివిజన్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరించిన కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒకరు అభిప్రాయపడ్డారు.

పాతబస్తీలో ఇన్‌చార్జీలు

మెహిదీపట్నం : ఎం.సామ్యూల్ (టీఆర్ఎస్ సెక్రటరీ)
ఆసిఫ్ నగర్ : ఎండీ ఇంతియాజ్ (టీఆర్ఎస్ సెక్రటరీ)
మల్లేపల్లి : లోక భూమారెడ్డి (టీఎస్ డెయిరీ చైర్మన్)
జియాగూడ : కసిరెడ్డి నారాయణరెడ్డి (ఎమ్మెల్సీ), రవీందర్ సింగ్ (మాజీ మేయర్)
లంగర్ హౌజ్ : ఏ జీవన్ రెడ్డి (ఎమ్మెల్యే)
టోలీచౌక్ : లింగంపల్లి కిషన్ రావు (టీఎస్ ఆగ్రో చైర్మన్)
మొఘల్ పురా : తాడూరి శ్రీనివాస్ (టీఎస్ఎంబీసీ చైర్మన్)

..ఇంకా పలువురు నాయకులు ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టారు. వీరంతా ప్రచారాస్త్రాలుగా ఏ అంశాలను తీసుకుంటారో అంతుచిక్కడం లేదు. ఈ క్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం పాతబస్తీలోనూ తాము 10 డివిజన్లను గెలుస్తామని వ్యక్తం చేస్తున్న ధీమా వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. రానున్న వారంలో ఇన్‌చార్జీలకు అందే ఆదేశాలను బట్టి అది ఉత్తుత్తిదేనా? నిజంగానే గెలుపునకు ప్రయత్నిస్తున్నారా? అన్న లెక్క తేలుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆనంద్ గౌడ్‌కు అధిష్ఠానం సహకరించేనా.?

గోషామహల్ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఆనంద్ గౌడ్‌కు ఎప్పుడూ దురదృష్టమే వెంటాడుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రి వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి జాంబాగ్ డివిజన్ నుంచి బరిలోకి దిగారు. తనకున్న శక్తి, యుక్తులన్నింటినీ ఉపయోగించి ఎంఐఎం అభ్యర్థికి ముచ్చెమటలు పట్టించారు. గ్రేటర్ ఓటింగ్ అనంతరం లెక్కింపు సందర్భంగా సదరు నాయకుడు విజయం సాధించారని సంకేతాలు సైతం వెలువడ్డాయి. అంతలోనే ఎంఐఎం అభ్యర్థి ఐదు ఓట్లతో విజయం సాధించారని ఫలితం వెలువడింది. దీంతో నిర్ఘాంతపోయిన నాయకుడు విచారంతో కౌంటింగ్ హాల్ నుంచి బయటకొచ్చారు. గట్టి పోటీనిచ్చిన పార్టీ అభ్యర్థికి ప్రత్యామ్నాయంగా పదవి ఇస్తారని మంత్రి నుంచి హామీ లభించిందని ప్రచారం జరిగింది. ఆ నాయకునికి నేటి వరకు ఎలాంటి పదవి దక్కలేదు. గత ఎన్నికల్లో నాంపల్లి నియోజకవర్గం నుంచి సదరు నాయకుని పేరు ముందుగానే విడుదల చేసినా జాబితాలో మాత్రం ప్రకటించారు. నెల రోజుల పాటు నియోజకవర్గంలో పాదయాత్రలు చేపట్టారు. ప్రచారంలో ముందు వరుసలో నిలిచారు. బాగానే ఖర్చు చేశారు. అసలు అతను అభ్యర్థే కాదని, అదే పేరుతో ఉన్న మరో అభ్యర్థి పేరు తెరమీదకు వచ్చింది. అభ్యర్థిగా ఉన్న అతన్ని మార్చడం వెనుక అతడంటే గిట్టని నగరానికి చెందిన ఒక మంత్రి ప్రమేయం ఉందని సదరు నేత బహిరంగంగానే విమర్శించారు. ఇప్పుడూ మళ్లీ జాంబాగ్ డివిజన్ నుంచి పోటీ చేసేందుకు పాదయాత్రలు నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు టికెట్టు ఖరారు చేశారు. పార్టీని నమ్ముకున్న ఆ ఆనంద్‌గౌడ్‌కు అధిష్ఠానం ఏ మేరకు సహకరిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News