స్టాంపు డ్యూటీపై కొండంత ఆశ

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ, ఆర్థిక అంశాలు భూముల చుట్టే తిరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఊహించని పురోగతి కనిపిస్తోందని ముఖ్యమంత్రి సహా మంత్రులు చాలా మంది మాట్లాడుతున్నారు. తాజా బడ్జెట్ ప్రసంగంలో సైతం మంత్రి హరీశ్‌రావు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇక రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌ల మధ్య ఫామ్ హౌజ్ రాజకీయం అందరికీ తెలిసిందే. ఈ పరిణామాలు ఇలా ఉన్నందునే ఈసారి బడ్జెట్‌లో భూముల రిజిస్ట్రేషన్లు, స్టాంపు […]

Update: 2020-03-08 08:29 GMT

దిశ, న్యూస్ బ్యూరో:
రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ, ఆర్థిక అంశాలు భూముల చుట్టే తిరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఊహించని పురోగతి కనిపిస్తోందని ముఖ్యమంత్రి సహా మంత్రులు చాలా మంది మాట్లాడుతున్నారు. తాజా బడ్జెట్ ప్రసంగంలో సైతం మంత్రి హరీశ్‌రావు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇక రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌ల మధ్య ఫామ్ హౌజ్ రాజకీయం అందరికీ తెలిసిందే. ఈ పరిణామాలు ఇలా ఉన్నందునే ఈసారి బడ్జెట్‌లో భూముల రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీపై ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. గడచిన మూడేళ్లుగా స్వల్ప స్థాయిలో ఈ పన్ను ఆదాయం పెరుగుతుండగా రానున్న ఆర్థిక సంవత్సరానికి మాత్రం ప్రభుత్వం భారీ లక్ష్యాన్నే పెట్టుకుంది.

కనీసంగా రూ. 10 వేల కోట్లను స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం సుమారు రూ. 6,146 కోట్లను ఆర్జించనున్నట్లు అంచనా వేస్తే సవరించిన లెక్కల ప్రకారం అది కొంత పెరిగి రూ. 6,446 కోట్లకు చేరుకుంది. అంతకుముందు సంవత్సరం కొంత తగ్గింది. 2018-19 సంవత్సరంలో రూ. 6,689 కోట్లు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ చివరకు రూ. 5,344 కోట్లు మాత్రమే సమకూరాయి. ఈ సంవత్సరం మాత్రం ఏకంగా పది వేల కోట్ల రూపాయల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమకూరుతున్న దానికంటే సుమారు మూడున్నర వేల కోట్లు ఎక్కువగా ఆర్జించాలనుకుంటోంది.

సర్కారు భూముల్ని అమ్మడం ద్వారా సుమారు 15 వేల కోట్లను ఆర్జించాలనుకుంటున్న ప్రభుత్వం ఆ భూముల రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీలతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న పరిస్థితుల్ని ప్రభుత్వం భారీ స్థాయిలోనే లెక్కలేసుకుంటోంది కాబోలు! అంచనాలు ఎలా ఉన్నా 2016 తర్వాతి నుంచి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తోంది. రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీ ఆదాయం సైతం పెరిగింది. ఈసారి ఏకంగా పదివేల కోట్ల రూపాయల లక్ష్యాన్ని అంచనా వేస్తున్నందున సమీప భవిష్యత్తులో భూముల విలువను సవరించడం, కొత్త విధాన నిర్ణయాల కారణంగా రియల్ ఎస్టేట్ రంగంతో పాటు భూముల క్రయ విక్రయాలు, లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు భారీగానే ఉంటాయన్న సంకేతాన్ని ఇచ్చినట్లయింది.

tags: Telangana, Stamps, Registration, Land Value, Real Estate, Income, Revenue

Tags:    

Similar News