'ఉచ్చు' కవితా విశ్లేషణ

ప్రముఖ కవి, ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ తెలుగు భాషా ఉపన్యాసకులు, డాక్టర్ డింగరి నరహరి ఆచార్య కలం నుండి జాలువారిన ఉచ్చు కవిత పై విశ్లేషణ వ్యాసం.

Update: 2023-07-08 19:15 GMT

ప్రముఖ కవి, ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ తెలుగు భాషా ఉపన్యాసకులు, డాక్టర్ డింగరి నరహరి ఆచార్య కలం నుండి జాలువారిన ఉచ్చు కవిత పై విశ్లేషణ వ్యాసం. కవిత ఏమిటని ఆసక్తితో చదివాను. నాకు చాలా నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది. ఉచ్చు అంటే ఏమిటి తెలుసుకోవాలనే కుతూహలంతో చదవాల్సిన కవిత అనిపిస్తుంది. ఉచ్చు తాడు సహాయంతో పెద్ద భవనాలు ఎక్కుట, జాలర్లు చేపలు పట్టుకోవడానికి ఉపయోగించేది, క్రూర జంతువులను బంధించి ఉంచే ఇనుప పంజరం. కుట్టు, అల్లిక మొదలైనవి పోసేటటువంటిది, వేటగాడు పక్షులను, జంతువులను పట్టుకోవడానికి త్రాడు లేదా కంచెతో తయారుచేసింది. గొంతుకు తాడు గట్టిగా బిగించడం.

అందలం ఎక్కిస్తామంటే

ఆనందంగా గంతేసి వెళ్ళా

అదృష్టం అందలమెక్కిస్తే బుద్ధి బురదలోకి లాగింది. అందరు అందలం ఎక్కితే మోసే వారు ఎవరు అని తెలుగులో సామెతలు విన్నాం. అందలం అంటే పార్శ్యముల మరుగు లేని పల్లకి, కొయ్యతో తయారు చేయబడిన గుండ్రని ఆట వస్తువు. అందలం ఎక్కిస్తామంటే ఆనందంగా గంతేసి వెళ్ళా. అందలం అంటే పల్లకి అని అర్థమవుతుంది. పల్లకి ఎవరు ఎక్కుతారు? పల్లకి ఎవరు పడితే వాళ్ళు ఎక్కారు. రాజులు రాణులు పల్లకి ఎక్కి ఊరేగడం, నూతనంగా వివాహం చేసుకున్న వధూవరులను పల్లకిలో ఎక్కించి ఊరేగించడం, జనం వింతగా చూడటం మన అందరికీ తెలుసు. అదొక ఆనవాయితీగా వస్తోంది.

ఉచ్చులో చిక్కుకున్న అతను ఏ దేశానికి రాజు కాదు, నూతనంగా పెళ్లి చేసుకున్న వరుడు కాదు, ఈనాటి నవీన కాలం నాటి రాజకీయ నాయకుడు కాదు. మరి ఎందుకు అతనిని అందలం ఎక్కిస్తున్నారు ఆశ్చర్యంగా తోస్తుంది. ఆనందం అంటే ఏమిటి ఆనందం శ్రేయస్సు కోసం తపించడం అనేది ఒక నిర్దిష్టమైన జీవశక్తుల అతిశయం. ఆనందం అంటే కల్పిత ప్రదేశం, అక్కడ వింతలు ఉంటాయి. ఆనందం అంటే మనుషుల జీవితంలో క్షోభ, దుఃఖం లేకుండా యోగా శాంతి ప్రాప్తించుటకు ఒక సాధన, మనసు ఉత్సాహంతో ఉండే టప్పుడు కలిగే భావన, ఎటువంటి బాధలు లేకుండా ఉండడం.

మోసే వాడిలో ఒకడు రాలేదంటే

మోయక తప్ప లేదు.

పల్లకిని ఎవరు మోస్తారు? బోయిలు పల్లకిని మోస్తారు. పల్లకిని మోసే బోయి ఒకడు రాలేదు అని అర్థం అవుతుంది. అందుకే అతను పల్లకిని మోయవలసిన అవసరం ఏర్పడింది. అక్కడ పల్లకిని మోసే బోయి ఒకడు రాలేదు అనేది సాకుగా అనిపిస్తుంది. కాబట్టి నిర్వాహకులు చెప్పగానే పల్లకిని మోయవలసిన బాధ్యత ఏర్పడింది.

పంక్తి భోజనం అంటే

'పడి పడి పరుగెత్తా

పంక్తి భోజనం భోజనం చేయడానికి వరుసగా కూర్చోవడం. పల్లెలో బంతి భోజనాలు అని పిలుస్తారు. పెళ్లిళ్లలో, శుభ కార్యక్రమాల్లో, దేవుని పూజలో పంక్తి భోజనం ఏర్పాటు చేస్తారు. అందరూ కలిసి సామూహికంగా కూర్చుండి సహపంక్తి భోజనం చేస్తారు. పంక్తి భోజనంలో అన్ని రకాల వంటలు ఉంటాయి. చుట్టాలు, బంధువులు,స్నేహితులు అందరూ హాజరవుతారు. అలాగే ఇతను పంక్తి భోజనం అని చెప్పగానే అందరితో కలిసి విందు భోజనం చేయవచ్చును అనే సంకల్పంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

వడ్డన వాడొకడు రాలేదంటే

నడ్డి విరిగే దాకా వడ్డించా

పిలవగానే పంక్తి భోజనానికి వెళ్ళాడు. అందరితో కలిసి భోజనం చేయాలనుకున్నాడు. కానీ అక్కడి నిర్వాహకులు వడ్డించేవాడు రాలేదనే సాకుతో వడ్డించమనే పనిని అప్పగించారు. మొహమాటంతో వాళ్ళు చెప్పినట్లే నడ్డి విరిగే దాకా అతిథులు అందరికి వడ్డించాడు. దురదృష్టం అంటే ఏమిటో అవగతం అవుతుంది. ఈనాటి మనుషుల స్వార్థం విలువ ఏమిటో మనకు కళ్ళకు కట్టినట్టు అర్థమవుతున్నది.

పాటల ప్రోగ్రాం అంటే

పరమ పరవశంతో వెళ్ళా

ఈనాటి ఆధునిక కాలంలో నవీన మానవుడు పెళ్లిళ్ళలో మరి శుభ కార్యక్రమాల్లో ఈవెంట్స్ అని పాటల ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నారు. కళాకారులు అలనాటి ఆపాత మధురమైన పాత పాటలు పాడి జనాల మనసును ఆనందపుటూయలలో ఊరేగింపు చేస్తారు. పరవశం అంటే భావనలో నిమగ్నమైన స్థితి లేక భావన. పాటల్లో లీనమై పరవశాన్ని అనుభవించవచ్చని ఆనందంతో వెళ్ళాడు. తీరా ఏం జరిగింది ఆలోచించడానికి వీలు లేని పరిస్థితి అతనికి ఎదురయింది.

కాస్త తలుపు దగ్గర నిలిచి

అతిథుల నాహ్వానించమంటే

ఔననక తప్పలేదు తిప్పలు పడ్డా

ఏదో సరదా పడి శుభ కార్యక్రమం కదా పాటల ప్రోగ్రాంలో పాల్గొని పరవశించవచ్చనే ఉబలాటంతో ఉరుకుల పరుగుల జీవితంలో వెళ్ళాడు. కానీ ప్రోగ్రామ్ కు వెళ్లినందుకు నిర్వాహకులు సాకుతో కాస్త తలుపు దగ్గర నిలిచి అతిథులను ఆహ్వానించమంటే నేను అలా చేయను అని చెప్పలేదు. మరి వాళ్ళు ఏమనుకుంటారో అని అక్కడికి వెళ్లినందుకు సిగ్గుపడుతూ ఔను అని ఒప్పుకున్నాడు. అతిథులను సాదరంగా శుభ కార్యక్రమానికి ఆహ్వానించాడు. పాటల ప్రోగ్రాంకు వెళ్లి లేని అవస్థలు ఎదుర్కొన్నాడు.

వేదిక నెక్కమంటే

మాట్లాడటానికనుకున్నా

వచ్చే ఉపన్యాసకుల

కుర్చీలు వేస్తూ కూర్చోలేక పోయా

రండి సార్ వేదిక నెక్కమని సాదరంగా ఆహ్వానిస్తే సంతోషంగా అనిపించింది. ఎందుకు వేదిక నెక్కమంటున్నారు. ఏ విషయం గురించి నన్ను పిలుస్తున్నారు. ఇదేమిటి విపరీతం అర్థం కాలేదు. నన్ను గౌరవించి వేదిక మీద కూర్చుండబెట్టి మాట్లాడమంటారు కాబోలు అని మనసులో అనుకున్నాడు. తీరా చూస్తే వేదికను ఎక్కమన్నది వేదిక మీద కూర్చుని ఉపన్యసించడానికి కాదని తెలిసిపోయింది. సమావేశానికి వచ్చే ఉపన్యాసకుల కొరకు వేదిక మీద కుర్చీలు వేయమని చెప్పారు. వేదిక మీద నిర్వాహకులు చెప్పినట్లే కుర్చీలు వేసాను. జరిగిన దానిని తలుచుకొని పాటల ప్రోగ్రాం లో కూర్చోలేకపోయాను.

దౌర్భాగ్యం అనుకోవడం లేదు

దౌర్భాగ్యం తిండి, బట్ట, గృహం వంటి కనీస అవసరాలు లేని దీనస్థితి, చెడ్డ భాగ్యం లేదా అదృష్టం లేకపోవుట. దౌర్భాగ్యం అనుకోవడం లేదు.

కవి భావన చక్కగా ఉంది. కానీ దౌర్భాగ్యం అని అనుకోవలసిన దుస్థితి కనబడుతుంది. అతని దురదృష్టం కాకపోతే అక్కడికి వెళ్లి ఇబ్బందులను ఇక్కట్లను ఎదుర్కొని ఇడుముల పాలయ్యాడు.

మనుషులు చేస్తున్న

మర్యాద గారడీ అని తెలిసింది

మర్యాద పెద్దల పట్ల కలిగి ఉండే ఆరాధన పూర్వకమైన భావన,పెద్ద పెద్ద మనుషులతో పరిచయం ఉండడం, మంచి నడవడి కలిగి మంచి ప్రవర్తన కలిగిన వాళ్లు అని చెప్పవచ్చు. గారడీ అంటే అసాధ్యమైన పనిని సుసాధ్యం చేస్తూ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపే వినోదాన్ని కలిగించే విద్యా ప్రదర్శన,. మంత్రం ద్వారా పాము విషం తినేటటువంటిది. బజారులో నేలపైన చేసేది గారడీ. మోసం చేసేది గారడీ. ప్రదర్శన తర్వాత డబ్బు అడుగుతారు. మనుషులను అవసరానికి వాడి పడేసే వస్తువులుగా చూసే రోజుల్లో మనం ఉన్నామనడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. అవసరం ఉంటేనే మనుషులు మర్యాద చేస్తారు. అవసరం తీరిపోగానే ముఖం చూడని మనుషులు ఉన్నారు. మనుషులు చేస్తున్న మర్యాద గారడీ అని తెలిసింది.

మౌనంగా ఉండలేక పోయాను

మరోసారి ఉచ్చులో చిక్కద్దనుకున్నాను

మౌనం అంటే నోరు మూసుకొని మాట్లాడకుండా ఉండే క్రియ. మౌనంగా ఉండలేకపోయాను. మౌనంగా ఉండలేని స్థితి ఏర్పడింది. మనుషులు చేస్తున్న మాయాజాలం అర్థమైంది. మరోసారి ఉచ్చులో చిక్కద్దనుకున్నాను. కవి డింగరి నరహరి ఆచార్య భావన అద్భుతంగా ఉంది. చక్కని కవితను రాసి సమాజానికి స్ఫూర్తిని అందించారు. ఇక ఈ ప్రపంచం. ఒక మాయా వస్తువు అని పవిత్ర గ్రంధాల్లో వ్రాయబడి ఉంది. మనుషులు వేసే ఉచ్చుల వలలోకి చిక్కకుండా మనలో చైతన్యాన్ని కలిగించారు. ఉచ్చు కవిత సందేశాత్మకంగా ఉంది. కవి డింగరి నరహరి ఆచార్య మరిన్ని మంచి కవితా సుమాలు పూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

(డాక్టర్ డింగరి నరహరి ఆచార్య ఉచ్చు కవిత పై విశ్లేషణ)

నరేంద్ర సందినేని

70930 30259


Similar News