పూర్తి స్థాయి నీటి మట్టానికి SRSP ప్రాజెక్టు..!

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉత్తర తెలంగాణలోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే శ్రీరాం సాగర్ జలకళతో తొణికిసలాడుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1091.00 అడుగులు కాగా గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్టులో 1089.8 అడుగులు, 90.31 టీఎంసీలకు గాను 83.772 టీఎంసీల నీరు వచ్చి చేరింది. జూన్ వరకు ప్రాజెక్టులో 27 టీఎంసీల నీరు ఉండగా ఈ సీజన్ లో ఇప్పటి వరకు 76.12 టీఎంసీల వరద నీరు మహారాష్ర్టలో భారీ […]

Update: 2020-09-04 02:29 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ :

ఉత్తర తెలంగాణలోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే శ్రీరాం సాగర్ జలకళతో తొణికిసలాడుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1091.00 అడుగులు కాగా గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్టులో 1089.8 అడుగులు, 90.31 టీఎంసీలకు గాను 83.772 టీఎంసీల నీరు వచ్చి చేరింది. జూన్ వరకు ప్రాజెక్టులో 27 టీఎంసీల నీరు ఉండగా ఈ సీజన్ లో ఇప్పటి వరకు 76.12 టీఎంసీల వరద నీరు మహారాష్ర్టలో భారీ వర్షాల కారణంగా వచ్చి చేరింది. జూలై 1 న బాబ్లీ గేట్లు ఎత్తిన మహారాష్ర్ట అధికారులు తరువాత అతి భారీ వర్షాలకు గైక్వాడ్, విష్ణుపురి గేట్లను ఎత్తి వేశారు. దాంతో పెద్ద ఎత్తున నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. ఈ సీజన్ లో ఆగస్టు 28న ప్రాజెక్టులో ఇదే స్థాయిలో నీటి మట్టం ఉండగా అధికారులు ఇన్ ఫ్లో ప్రకారం అవుట్​ఫ్లో ను పెంచుతూ దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం 3000 క్యూసెక్ ల నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా నీటి విడుదలను పెంచి 7,513 క్యూసెక్ నీటిని దిగువకు పంపుతున్నారు.

మిడ్​మానేరు, ఎగువ మానేరుకు కొనసాగుతున్న నీటి విడుదల..

శ్రీరాం సాగర్‌లోకి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు లక్ష క్యూసెక్కులు వస్తే ఒక్క రోజులోనే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే పరిస్థితి ఉంది. మూడేళ్ల తరువాత సెప్టెంబర్ లోనే ప్రాజెక్టు పూర్తిగా నిండింది. గడిచిన ఏడాది ఆక్టోబర్ లో ప్రాజెక్టు 44 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈ సారి నెల ముందుగానే ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. గడిచిన నెలలో వారబంధి కింద కాకతీయ, సరస్వతి, లక్ష్మి కెనాల్​ద్వారా నీటి విడుదల జరిగినా, ఎన్నడూ ఎక్కువగా నీటిని విడుదల చేయలేదు.

అంతే కాకుండా నిజామాబాద్ జిల్లాలో లిఫ్ట్​లకు సైతం నీటి విడుదల నిరంతరం కొనసాగుతోంది. గురువారం మూడు వేల క్యూసెక్ ల నీరు ప్రాజెక్టులోకి రాగా కాకతీయ కాలువకు 5 వేల క్యూసెక్​లు, లక్ష్మి కాలువకు 200, సరస్వతి కాలువకు 600, నిజామాబాద్ జిల్లాలోని ఆలీసాగర్ లిఫ్ట్​ద్వారా 540, గుత్ప లిఫ్ట్​ద్వారా 405, అవిరి రూపంలో 152 క్యూసెక్​లు వెళ్లడం ద్వారా 7,513 క్యూసెక్ ల నీరు ఖర్చవుతోంది. కాకతీయ కాలువ ద్వారా 5000 క్యూసెక్ ల నీటి విడుదల జరుగుతుండడంతో కరీంనగర్ జిల్లాలోని ఎగువ మానేరు, దిగువ మానేరులను నింపుతున్నారు. దాంతో పాటు వరంగల్, ఖమ్మం జిల్లాలో సాగుకు నీటి విడుదల పుష్కలంగా జరుగుతోంది.

ఎప్పుడైనా గేట్లు ఎత్తివేసే అవకాశం..

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులో నీటి మట్టం 1089 అడుగులు ఉండేలా వారం రోజులుగా మెయింటనెన్స్​ చేస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వానకాలం పంటలకు ఢోకా లేదని రైతులు భావిస్తున్నారు. దాంతో ప్రాజెక్టు కింద సాగు పంటలకు మాత్రమే ఇప్పుడు నీటి విడుదల సాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటే 42 గేట్లు ఎత్తి దిగువకు, అదీ ప్రభుత్వం అనుమతిస్తే నీటి విడుదల చేసేందుకు అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News