కన్నీళ్లే మిగిలాయ్.. గన్నీ బ్యాగుల్లేక మొలకెత్తుతున్న ధాన్యం
దిశ, హుస్నాబాద్ : రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అక్కడ రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం మార్కెట్ యార్డులో నిర్వహించకుండా బహిరంగ ప్రదేశాల్లో కొనుగోలు కేంద్రాలు నిర్వహించడం ద్వారా అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో దాదాపు 1,800 మంది రైతుల నుండి 1,23,562 క్వింటాళ్ల ధాన్యాన్ని ఇప్పటి వరకు కొనుగోలు చేసినట్లు అధికారులు […]
దిశ, హుస్నాబాద్ : రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అక్కడ రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం మార్కెట్ యార్డులో నిర్వహించకుండా బహిరంగ ప్రదేశాల్లో కొనుగోలు కేంద్రాలు నిర్వహించడం ద్వారా అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో దాదాపు 1,800 మంది రైతుల నుండి 1,23,562 క్వింటాళ్ల ధాన్యాన్ని ఇప్పటి వరకు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అధికారులు సకాలంలో గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు సమకూర్చుకోవడంతో అకాల వర్షాలకు ఆరుగాలం పండించిన ధాన్యం పూర్తిగా ముద్దయిపోతుందని రైతులు వాపోతున్నారు.
గన్నీ బ్యాగుల్లో నింపిన ధాన్యాన్ని మిల్లర్లు త్వరగా తీసుకోకుండా లారీల కొరత ఉందంటూ సాకులు చెబుతూ తూకం వేసిన ధాన్యం మొత్తం కొనుగోలు కేంద్రాల్లో ఉండడంతో మిల్లర్లు తీసుకెళ్లేంతవరకు రైతు బాధ్యతేనని అధికారులు, మిల్లర్లు అనడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తూకమైన ధాన్యాన్ని మిల్లర్లు సంచికి 1కిలో, మట్టికి 1కిలో, తడిసిన ధాన్యమైతే ఏకంగా నాలుగు కిలోలు కోత పెడుతున్నారని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూకమైన ధాన్యం దాదాపు పది రోజులు గడుస్తున్న మిల్లర్లు తీసుకెళ్లకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తడిసిన ధాన్యం కోత లేకుండా తీసుకోవడంతో పాటు గన్నీ బ్యాగుల కొరతను తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు.
రైతులను దోచుకుంటున్న మిల్లర్లు..
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్న అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నరు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత రైతులను వెంటాడుతోంది. రైతులకు టార్పాలిన్లు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో మొలకెత్తిన ధాన్యం కొర్రీ లేకుండా ప్రభుత్వమే కొనాలి. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ కొరవడింది.
-సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్
రైతులు అధైర్యపడొద్దు..
కొనుగోలు కేంద్రాల్లోని ప్రతి గింజను కొంటాం. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం తీసుకుంటాం. మిల్లర్లతో మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో తలెత్తుతున్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం. డివిజన్ పరిధిలోని 108 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు 90 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తి కావడంతో కేంద్రాలను మూసేశాం. ఇప్పటి వరకు డివిజన్ కేంద్రంలో 14లక్షల ధాన్యం కొన్నం. రైతుకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.