ఏడేళ్ల గరిష్ఠానికి బంగారం!
దిశ, వెబ్‌డెస్క్: గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ చైనాలో తగ్గినప్పటికీ అనేక దేశాలకు పాకి అన్ని ఆర్థిక వ్యవస్థలను దెబ్బ తీస్తుండటంతో మదుపర్లు ఎక్కువగా బంగారంపై పెట్టుబడికి ఆసక్తి చూపిస్తున్నారు. పైగా, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 31 శాతానికి పడిపోయిన నేపథ్యంలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతింది. ఈ పరిణామాలు పెట్టుబడిదారులకు చమురు నుంచి పసిడిపై పెట్టుబడికి ఆకర్షణగా మారింది. అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 45 డాలర్ల నుంచి 31.52 డాలర్లకు పడిపోయింది. […]
దిశ, వెబ్‌డెస్క్: గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ చైనాలో తగ్గినప్పటికీ అనేక దేశాలకు పాకి అన్ని ఆర్థిక వ్యవస్థలను దెబ్బ తీస్తుండటంతో మదుపర్లు ఎక్కువగా బంగారంపై పెట్టుబడికి ఆసక్తి చూపిస్తున్నారు. పైగా, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 31 శాతానికి పడిపోయిన నేపథ్యంలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతింది. ఈ పరిణామాలు పెట్టుబడిదారులకు చమురు నుంచి పసిడిపై పెట్టుబడికి ఆకర్షణగా మారింది. అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 45 డాలర్ల నుంచి 31.52 డాలర్లకు పడిపోయింది. కేవలం సెకన్ల వ్యవధిలో ధరలు 31 శాతం తక్కువను నమోదు చేశాయి. చమురుకు డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో ఉత్పత్తిని తగ్గించాలని భావించిన సౌదీకి రష్యా ప్రతికూలంగా స్పందించడంతో రష్యాను నిలువరించేందుకు సౌదీ భారీగా చమురు ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. ఇంధనానికి డిమాండ్ తగ్గుతుందనే ఆందోళనతో మదుపర్లు బంగారం వైపు దృష్టి సారించారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటం, అన్ని దేశాల మార్కెట్లు క్షీణిస్తుండటం వంటి పరిణామాల వల్ల దేశీయంగా బంగారం దిగుమతులు కూడా భారీగా తగ్గాయి. ఫిబ్రవరిలో బంగారం దిగుమతులు 41 శాతం పడిపోయాయి. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే మన దేశం ఫిబ్రవరిలో కేవలం 46 టన్నుల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకుంది. గతేడాది ఫిబ్రవరిలో 77.64 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం బంగారం ఔన్స్ ధర 1,700 డాలర్ల వరకూ వెళ్లినప్పటికీ ముగింపుతో పోలిస్తే 9 డాలర్లు తగ్గి ఔన్స్ బంగారం 1,666 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఔన్స్ బంగారం గత వారంతో పోలిస్తే వారం వ్యవధిలోనే 6.4 శాతం పెరగడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభం నుంచి లెక్కిస్తే ఇది 11.2 శాతం పెరుగుదల అని విశ్లేషకులు చెబుతున్నారు.
బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం సోమవారం కంటే వంద రూపాయలు తగ్గి రూ. 41,980 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల బంగారం రూ. 100 పెరిగి రూ. 45,800గా నమోదైంది. వెండి ధరలు కూడా పసిడి బాటలోనే స్థిరంగా ఉన్నాయి. గత వారం భారీగా పెరిగిన వెండి మంగళవారం అంతేస్థాయిలో తగ్గి కిలో వెండి రూ.49,500 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.110 తగ్గి రూ. 44,050 వద్ద ట్రేడయింది. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు దేశీయంగా బంగారం డిమాండ్‌కు కారణమవుతాయి. స్థానిక పరిస్థితులు కూడా బంగారం ధరలను నిర్ణయిస్తాయి. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్ వంద దేశాలకు విస్తరించడం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం వంటి పరిణామాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లనుందనే సంకేతాలతో దేశీయ మార్కెట్లో బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.