న్యూఢిల్లీ : టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. భారత జట్టు మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ పోస్ట్ ద్వారా మంగళవారం వివరించాడు. కోహ్లీకి క్రికెట్ పట్ల ఉన్న అంకితభావం, క్రమశిక్షణ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ.. ఐపీఎల్‌లోనూ కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ తరఫున ఆడాడు. ఈ సందర్భంగా అతనితో ఉన్న అనుబంధాన్ని ఇన్‌స్టా పోస్టు రూపంలో పంచుకున్నాడు.
విరాట్ క్రికెటర్‌గానే కాకుండా వ్యక్తిత్వపరంగా ఎదిగిన తీరు, కుర్రాడిగా నెట్ సెషన్‌లో టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్లతో కలిసి నడిచిన తీరుపై ప్రశంసలు కురిపించాడు. 'నెట్స్‌లో నీ క్రమశిక్షణ మైదానంలో ఆటపై మక్కువ చూస్తే ఇతరులకు కూడా బ్లూ జెర్సీ ధరించాలనే కోరిక పుడుతుంది. నువ్వొక అద్భుత నాయకుడివి. ఆట పట్ల నీలోని అగ్నిని అలానే రగిలిస్తూ ఉంచు. నీకోసమే ఈ ప్రత్యేకమైన గోల్డెన్ బూట్ బహుమతి. ఎల్లవేళలా దేశం గర్వపడేలా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చాడు.