సెమీస్‌లో యుకీ బాంబ్రీ జోడీ ఓటమి
తొలి సెట్ కోల్పోయిన తర్వాత అద్భుతంగా పుంజుకున్న యుకీ బాంబ్రీ జోడీ రెండో సెట్‌ను టైబ్రేకర్‌లో గెలుచుకుంది.
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ యుకీ బాంబ్రీకి నిరాశ ఎదురైంది. బ్రిస్బేన్‌లో జరుగుతున్న బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో యుకీ బాంబ్రీ జోడీకి సెమీస్‌లో ఓటమిపాలైంది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్ మ్యాచ్‌లో యుకీ బాంబ్రీ, రాబిన్ హాస్(నెదర్లాండ్స్) జంట 3-6, 7-6(7-5), 9-11 తేడాతో లాయిడ్ గ్లాస్‌పూల్ (ఇంగ్లాండ్)-జెన్ జులియన్ రోజెర్(నెదర్లాండ్స్) జోడీ చేతిలో పోరాడి ఓడింది. గంటా 40 నిమిషాలపాటు మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్ కోల్పోయిన తర్వాత అద్భుతంగా పుంజుకున్న యుకీ బాంబ్రీ జోడీ రెండో సెట్‌ను టైబ్రేకర్‌లో గెలుచుకుంది.ఇక, నిర్ణయాత్మక మూడో సెట్‌లో పోరాడినప్పటికీ ప్రత్యర్థి జోడీ ముందు ఓటమిని అంగీకరించక తప్పలేదు. మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సబలెంక, వింబుల్డన్ మాజీ చాంపియన్ రిబాకినా ఫైనల్‌కు దూసుకెళ్లారు. రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన విక్టోరియా అజరెంకకు సెమీస్‌లో సబలెంక షాకిచ్చింది. వరుస సెట్లను 6-2, 6-4 తేడాతో గెలుచుకుంది. మరో సెమీస్‌లో రిబాకినా 6-3, 6-2 తేడాతో లిండా నోస్కోవా(చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేసింది. పురుషుల మెన్స్ సింగిల్స్‌లో టాప్ సీడ్ హోల్గర్ రూనె(డెన్మా్ర్క్), గ్రిగోర్ డిమిత్రోవ్(బల్గేరియా) ఫైనల్‌కు చేరుకున్నారు. నేడు సింగిల్స్ ఫైనల్స్ జరగనున్నాయి.