ఆ ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లు ఆడాల్సిందే : గంభీర్ కీలక వ్యాఖ్యలు

భారత ఆటగాళ్లు ఫామ్‌లో ఉంటే అన్ని ఫార్మాట్లలో ఆడాల్సిందేనని టీమ్ ఇండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు.

Update: 2024-07-12 12:25 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత ఆటగాళ్లు ఫామ్‌లో ఉంటే అన్ని ఫార్మాట్లలో ఆడాల్సిందేనని టీమ్ ఇండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. తాజాగా జాతీయ మీడియాతో గంభీర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఇన్‌జ్యూరీ మేనేజ్‌మెంట్‌ను ఎక్కువగా నమ్మను. గాయాలు ఆటగాళ్ల జీవితంలో సహజం. మూడు ఫార్మాట్లు ఆడుతున్నప్పుడు గాయపడతారు. తిరిగి కోలుకుంటారు. మేము అతన్ని టెస్టుల కోసం ఉంచుతున్నామని, అతని పని భారాన్ని మేనేజ్ చేస్తున్నామంటూ వ్యక్తుల కోసం పనిచేయడాన్ని నేను పెద్దగా నమ్మను. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఆట ఆడేందుకు స్వల్ప వ్యవధే ఉంటే, మీరు ఎక్కువగా క్రికెట్ ఆడండి. మీరు మంచి ఫామ్‌లో ఉంటే మూడు ఫార్మాట్లలోనూ ఆడండి’ అని చెప్పాడు.

అలాగే, నిజాయతీగా ఆడటం ముఖ్యమని, వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించాడు. ‘నిజాయతీగా ఆడండి. ఫలితాలు అవే వస్తాయి. నేను బ్యాటింగ్ చేసేటప్పుడు రిజల్ట్ గురించి ఆలోచించను. ఇన్ని పరుగులు చేయాలని చూడను. నా వృత్తి పట్ల నిజాయతీగా ఉంటాను. మీకు సరైందని అనిపిస్తే, జట్టుకు ప్రయోజనం భావిస్తే ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉన్నా మీరు ఆ పని చేయండి. మైదానంలో నేను దూకుడుగా ఉన్నా, ఎవరితోనైనా గొడవ పడినా అదంతా జట్టు ప్రయోజనాల కోసమే. అంతిమంగా వ్యక్తిగతం కంటే జట్టు ముఖ్యం. ఇది మీ గురించి ఆలోచించడానికి వ్యక్తిగత క్రీడ కాదు. ఇది టీమ్ స్పోర్ట్స్. జట్టుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.’అని చెప్పుకొచ్చాడు. 


Similar News