WWE SuperStar Spectacle: 'నాటు.. నాటు..' పాటకు డాన్స్ వేసిన WWE స్టార్స్..

Update: 2023-09-08 17:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: WWE స్టార్లు కలిసి 'నాటు.. నాటు..' పాటకు డ్యాన్స్ చేశారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న WWE సూపర్ స్టార్ స్పెక్టేకిల్ తొలి మ్యాచ్‌లో భారత స్టార్‌ రెజ్లర్లు వీర్ మహాన్, జిందర్ మహాల్, సంగా పాల్గొన్నారు. వీరితో వెటరన్ స్టార్లు కెవిన్ ఓవెన్స్, శామీ జేన్, డ్రూ మెకింటైర్ పోటీపడ్డారు. అనంతరం నలుగురి మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్.. హైడ్రామాతో ఆరుగురి మధ్య పోటీగా మారింది. ఈ మ్యాచ్‌లో డ్రూ, కెవిన్, ఓవెన్స్ జోడీ విజయం సాధించింది. ఆ తర్వాతే అసలు మజా మొదలైంది. మ్యాచ్ తర్వాత ఆరుగురు రెజ్లర్లు తమ గెలుపోటములు పక్కన పెట్టి డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. ఈ క్రమంలో ముగ్గురు స్టార్లు కలిసి ఆస్కార్ అందుకున్న 'నాటు.. నాటు..' పాటకు కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఈ మ్యాచ్‌లో డ్రూ టీమిండియా జెర్సీ వేసుకొని వచ్చి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు కూడా.

ఇక రెండో మ్యాచ్‌లో రియా రిప్లే తన రా వుమెన్స్ ఛాంపియన్‌షిప్‌ను డిఫెండ్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ స్థానాన్ని జోయీ స్టార్క్ తీసుకుంది. ఆమె నటాల్యాతో తలపడింది. ఇద్దరూ పోటాపోటీగా ఈ మ్యాచ్‌లో తలపడ్డారు. ఈ క్రమంలోనే తనకు దక్కిన అవకాశాన్ని ఉపయోగించుకున్న జోయీ.. నటాల్యాను రింగు నుంచి బయట పడేసింది. కానీ ఆ తర్వాత తేరుకున్న నటాల్యా ఎట్టకేలకు జోయీని ఓడించింది. ఈ విజయంతో ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌కు నటాల్యా అర్హత సాధించింది. ఛాంపియన్‌షిప్‌లో రియా రిప్లీతో టైటిల్ కోసం నటాల్యా తలపడుతుంది. ఆ తర్వాతి మ్యాచ్‌లో గంథర్, డ్రూ మెకింటైర్ తలపడాల్సి ఉంది. అయితే డబ్ల్యూడబ్ల్యూఈ మేనేజ్‌మెంట్ మరో సర్‌ప్రైజ్‌తో ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. మెకింటైర్ స్థానంలో షాంకీ రింగులోకి వచ్చాడు. వీళ్లిద్దరి మధ్య జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది.

ఆరంభంలో గంథర్‌పై షాంకీ దూకుడు కనబరిచాడు. కానీ కాసేపటికే గంథర్ ఎదురుదాడికి దిగాడు. అది తట్టుకోలేకపోయిన షాంకీ రింగులో నుంచి బయటకు వచ్చేసి ఊపిరి పీల్చుకున్నాడు. ఇది చూసిన గంథర్ స్టేజిపై డ్యాన్స్ చేసి ఫ్యాన్స్‌లో జోష్ పెంచాడు. ఇది అవమానంగా భావించిన షాంకీ మళ్లీ బరిలో దిగి పోరాడే ప్రయత్నం చేశాడు. కానీ చివరకు గంథర్ ముందు నిలవలేక ఓటమి పాలయ్యాడు.


Similar News