WTC Final : అతడితో జాగ్రత్త.. ఆసీస్ బౌలర్లకు ఛాపెల్ వార్నింగ్
టీమ్ ఇండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీకి ఆసీస్‌పై మెరుగైన రికార్డు ఉంది.
దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీకి ఆసీస్‌పై మెరుగైన రికార్డు ఉంది. కోహ్లీ ఆసీస్‌పై 24 టెస్టులు ఆడగా.. 1,979 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో WTC Final మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లను ఆ జట్టు లెజెండ్ ఇయాన్ ఛాపెల్ హెచ్చరించాడు. కోహ్లీని ఇంగ్లాండ్ బౌలర్ల మాదిరిగా ఔట్ చేద్దామనుకుంటే అది వారికే ప్రమాదమని సూచించాడు. ‘విరాట్ 2014, 2021 లలో ఇంగ్లాండ్ బౌలర్లు అండర్సన్, బ్రాడ్, ఇతర ఇంగ్లీష్ బౌలర్ల బౌలింగ్‌లో ఇబ్బందులు పడ్డాడు. అప్పుడు వాళ్లు ఇక్కడి పరిస్థితులను ఉపయోగించుకుంటూ కోహ్లీని బోల్తా కొట్టించారు.
అయితే ఇదే రీతిలో ఆసీస్ బౌలర్లు కూడా కోహ్లీని బోల్తా కొట్టించాలని చూస్తే మాత్రం అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ బౌలర్లకు ఇక్కడి కండీషన్స్‌పై అవగాహన ఉంటుంది. అదీగాక కోహ్లీకి ఆసీస్‌పై మెరుగైన రికార్డు ఉంది. అతడు ఆసీస్ బౌలర్లను ఎంత ఇష్టంగా ఎదుర్కుంటాడనేది కోహ్లీకి ఉన్న రికార్డులను బట్టి అర్థం చేసుకోవచ్చు.
"డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగబోయే ఓవల్ గ్రౌండ్ బౌన్సీ వికెట్. అది విరాట్ బ్యాటింగ్‌కు బాగా సూట్ అవుతుంది. ఓవల్‌లో వాతావరణం కూడా ఇలాగే డ్రై గా ఉంటే ఆ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే విధంగా మారుతుంది. అప్పుడు విరాట్‌ను ఆపడం మరింత ప్రమాదకరమని" ఛాపెల్ అన్నాడు.