WTC Final 2023: చరిత్ర సృష్టించిన ఆసీస్.. తొలి జట్టుగా..

WTC Final 2023 టైటిల్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.

Update: 2023-06-11 16:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023 టైటిల్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. భారత్‌తో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆసీస్ 209 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో తొలిసారి టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఆసీస్.. అరుదైన ఘనతను సాధించింది. క్రికెట్ చరిత్రలోనే అన్నీ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. ఇప్పటికే ఐదు సార్లు వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆసీస్, రెండు ఛాంపియన్స్ ట్రోఫీలను, ఒక టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. తాజాగా డబ్ల్యూటీసీ ట్రోఫీ కూడా గెలిచి మొత్తం 9 ఐసీసీ టోర్నీల్లో ఛాంపియన్‌గా నిలిచింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ఆసీస్ నిలిచింది. ఆసీస్ క్రికెట్ జట్టు అరుదైన ఘనత అందుకుంది. ఐసీసీ నిర్వహించే అన్ని ఫార్మాట్ల మేజర్ ఈవెంట్లలో విజేతగా నిలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.

444 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 234 పరుగులకే కుప్పకూలింది. ఐదో రోజు.. 164-3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 70 పరుగులు మాత్రమే జోడించి 7 వికెట్లు కోల్పోయింది. తద్వారా లంచ్‌కు ముందే చేతులెత్తేసింది. కోహ్లీ 49, రహానే 46, కేఎస్ భరత్ 23 పరుగులు చేయగా.. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 3, స్టార్క్ 2, నాథన్ లైయన్ 4, కమిన్స్ 1 వికెట్ తీశారు.


Similar News