సాహా తిరిగి బెంగాల్‌కు?
భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా దేశవాళీలో తిరిగి సొంత గూటికి చేరనున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా దేశవాళీలో తిరిగి సొంత గూటికి చేరనున్నాడు. వచ్చే దేశవాళీ క్రికెట్ సీజన్‌లో అతను సొంత జట్టు బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సోమవారం భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో సాహా సమావేశమయ్యాడు. దీంతో అతను తిరిగి బెంగాల్‌కు ఆడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో 15 ఏళ్లపాటు బెంగాల్‌కు ఆడిన సాహా 2022లో ఆ జట్టును వీడాడు. అప్పటి నుంచి అతను త్రిపురకు ఆడుతున్నాడు. త్రిపుర తరపున అతను 590 పరుగులు చేశాడు. అందులో సెంచరీతోపాటు నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జట్టు మారేందుకు అతను త్రిపుర క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ‘రిటైర్మెంట్ ప్రకటించే ముందు కనీసం ఒక్క మ్యాచ్ అయినా బెంగాల్‌కు ఆడాలని సాహాను గంగూలీ కోరాడు. అయితే, అతను తన నిర్ణయాన్ని ఇంకా మాకు తెలియజేయలేదు’ అని త్రిపుర క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.