ఐదు వికెట్లతో చెలరేగిన శోభన.. ఉత్కంఠ మ్యాచ్‌లో యూపీపై బెంగళూరు విజయం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది.
దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. రిచా ఘోష్, మేఘన మెరుపులకుతోడు శోభన బంతితో చెలరేగడంతో బెంగళూరు(ఆర్సీబీ) తన తొలి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసింది. బెంగళూరు వేదికగా శనివారం చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 157 పరుగులు చేసింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో యూపీ వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 155 పరుగులే చేసింది. ఛేదనలో యూపీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కెప్టెన్ ఎలీసా హీలీ(5) దారుణంగా నిరాశపర్చింది. మరోవైపు, శోభన ఆశ బంతితో యూపీ పతనాన్ని శాసించింది. మరో ఓపెనర్ విృంద దినేశ్(18), మెక్‌గ్రాత్(22)లను శోభన ఒకే ఓవర్‌లో పెవిలియన్ పంపండంతో యూపీ 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం గ్రేస్ హ్యారిస్(38), శ్వేత సెహ్రావత్(31) జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు. నాలుగో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. అయితే, మరోసారి విజృంబించిన శోభన ఒకే ఓవర్‌లో వీరిద్దరితోపాటు కిరణ్ నవ్‌గిరే(1)ను అవుట్ చేసి యూపీని దారుణంగా దెబ్బకొట్టింది. ఆ తర్వాత పూనమ్ ఖేమ్నార్(14) విలువైన పరుగులు జోడించడంతో చివరి ఓవర్‌లో యూపీ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్‌లో మోలినిక్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో దీప్తి శర్మ(13 నాటౌట్), ఎక్లోస్టోన్(1 నాటౌట్) 8 పరుగులు మాత్రమే రాబట్టడంతో యూపీకి ఓటమి తప్పలేదు. ఐదు వికెట్లు తీసి ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించిన శోభన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
రిచా ఘోష్, మేఘన మెరుపులు
అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టును రిచా ఘోష్, మేఘన ఆదుకున్నారు. మొదట ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు సోఫి డివైన్(1), స్మృతి మంధాన(13)లతోపాటు ఎల్లీస్ పెర్రీ(8) దారుణంగా నిరాశపరిచారు. దాంతో ఆ జట్టు 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో తెలుగమ్మాయి సబ్బినేని మేఘన(53), రిచా ఘోష్(62) హఫ్ సెంచరీలతో మెరిసి జట్టును నిలబెట్టారు. ధాటిగా ఆడిన వీరు నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. వీరిద్దరూ అవుటైన తర్వాత మోలినెక్స్(9 నాటౌట్), శ్రేయాంక(8 నాటౌట్) అజేయంగా నిలువగా.. నిర్ణీత ఓవర్లలో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 157/6 స్కోరు చేసింది. యూపీ బౌలర్లలో రాజేశ్వరి 2 వికెట్లతో రాణించింది.
సంక్షిప్త స్కోరుబోర్డు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : 157/6(20 ఓవర్లు)
(రిచా ఘోష్ 62, సబ్బినేని మేఘన, రాజేశ్వరి గైక్వాడ్ 2/24)
యూపీ వారియర్స్ : 155/7(20 ఓవర్లు)
(గ్రేస్ హ్యారిస్ 38, శ్వేత సెహ్రావత్ 31, శోభనా ఆశ 5/22)