కీలక పోరులో ముంబైపై బెంగళూరు విజయం.. ప్లే ఆఫ్స్‌కు అర్హత

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.

Update: 2024-03-12 18:47 GMT

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ నాకౌట్‌కు చేరుకుకోగా.. మూడో స్థానంలో బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. ఎలిస్ పెర్రీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన వేళ ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబైపై 7 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టును ఆర్సీబీ నిలువరించింది. దీంతో ఆ జట్టు 19 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. సజన(30 టాప్ స్కోరర్). ఎలిస్ పెర్రీ(6/15) ఆరు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించింది. అనంతరం 114 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 15 ఓవర్లలో 115 పరుగులు చేసింది. అయితే, ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్‌లు తగిలాయి. ఓపెనర్లు మోలినెక్స్(9), కెప్టెన్ స్మృతి మంధాన(11) దారుణంగా నిరాశపరిచారు. సోఫి డివైన్(4) కూడా వెనుదిరగడంతో 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి బెంగళూరు తడబడింది. ఈ పరిస్థితుల్లో ఎల్లీస్ పెర్రీ(40 నాటౌట్), రిచా ఘోష్(36 నాటౌట్) ఇన్నింగ్స్ నిర్మించారు. బంతితో సత్తాచాటిన పెర్రీ బ్యాటుతోనూ మెరిసింది. రిచా ఘోష్‌, పెర్రీ కలిసి ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో బెంగళూరు సునాయాసంగా గెలిచింది.

ముంబై విలవిల

అంతకుముందు ఆర్సీబీ బౌలింగ్‌లో ముంబై బ్యాటర్లు విలవిలలాడారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 19 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ముంబై జట్టులో ఓపెనర్ సజన(30) టాప్ స్కోరర్. మొదట హేలీ మాథ్యూస్(26), సజన ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 43 పరుగులు జోడించారు. హేలీ మాథ్యూస్‌ను డివైన్ అవుట్ చేసి ప్రత్యర్థి పతనాన్ని ఆరంభించగా.. ఆ తర్వాత ఎలిస్ పెర్రీ ఆ జట్టు భరతం పట్టింది. ఎల్లీస్ పెర్రీ పేస్ దాటికి ముంబై బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. ఆరు వికెట్లు పడగొట్టిన ఆమె ప్రత్యర్థికి ఏ దశలోనూ పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(0), నాట్ స్కివర్ బ్రంట్(10), అమేలియా కెర్(2), అమన్‌జోత్ కౌర్(4), పూజ వస్త్రాకర్(6) దారుణంగా నిరాశపరిచారు. ముంబై జట్టులో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

సంక్షిప్త స్కోరుబోర్డు

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 113 ఆలౌట్(19 ఓవర్లు)

(సజన 30, హేలీ మాథ్యూస్ 26, ఎలిస్ పెర్రీ 6/15)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : 115/3(15 ఓవర్లు)

(ఎలిస్ పెర్రీ 40 నాటౌట్, రిచా ఘోష్ 36 నాటౌట్)

Tags:    

Similar News