ఢిల్లీ హ్యాట్రిక్ విజయం.. వరుసగా గుజరాత్‌కు నాలుగో పరాజయం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో ఢిల్లీ క్యాపిటల్స్ హవా కొనసాగుతోంది.

Update: 2024-03-03 18:09 GMT

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో ఢిల్లీ క్యాపిటల్స్ హవా కొనసాగుతోంది. తాజాగా గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసి టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై 25 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ 8 వికెట్లను కోల్పోయి 138 పరుగులు మాత్రమే చేసింది. మొదటి నుంచి ఢిల్లీ బౌలింగ్‌లో తడబడిన గుజరాత్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఖాతా తెరవకముందే గుజరాత్ ఓపెనర్ వొల్వార్డ్(0) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం జొనాస్సెన్, రాధా యాదవ్ బౌలింగ్‌లో వరుసగా బ్యాటర్లు తడబడ్డారు. ఓపెనర్, కెప్టెన్ బెత్ మూనీ(12), లిచ్‌పీల్డ్(15), వేద కృష్ణమూర్తి(12), కాతరిన్ బ్రైస్(3) నిరాశపర్చడంతో 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో గార్డ్‌నెర్(40) జట్టును ఆదుకునేందుకు పోరాటం చేసింది. అయితే, ఆమె దూకుడుకు జొనాస్సెన్ బ్రేక్ వేయడంతో గుజరాత్ ఆశలు ఆవిరయ్యాయి. తనూజ(13), తరన్నుమ్ పఠాన్(9) క్రీజులో నిలువలేదు. అయితే, మేఘ్న సింగ్(10 నాటౌట్), సయాలీ సత్ఘరే(7 నాటౌట్) వికెట్ కాపాడుకుని ఆలౌట్ ప్రమాదం నుంచి తప్పించారు. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్, జొనాస్సెన్ మూడేసి వికెట్లతో సత్తాచాట్టారు. శిఖా పాండే, అరుంధతి రెడ్డికి చెరో వికెట్ దక్కింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబైని వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు, గుజరాత్ వరుసగా నాలుగు పరాజయాలతో ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.

రాణించిన లానింగ్

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 163 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్(55) హాఫ్ సెంచరీతో రాణించింది. ఓపెనర్‌గా వచ్చిన ఆమె గుజరాత్ బౌలింగ్‌లో ధాటిగా ఆడి ఇన్నింగ్స్ నిర్మించింది. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ(13), ఎలీస్ క్యాప్సే(27) దూకుడుగా ఆడే క్రమంలో అవుటైనా లానింగ్ మాత్రం జట్టును మెరుగైన స్థితిలో నిలబెట్టింది. ఆమె అవుటైన తర్వాత జట్టు తడబడింది. సదర్లాండ్(20), జొనాస్సెన్(11), శిఖా పాండే(14 నాటౌట్) విలువైన పరుగులతో జట్టుకు పోరాడే స్కోరు దక్కింది. మేఘ్న సింగ్ 4 వికెట్లతో రాణించగా.. గార్డ్‌నెర్ 2 వికెట్లు, మన్నత్ కశ్యప్ ఒక్క వికెట్ తీసింది.

సంక్షిప్త స్కోరుబోర్డు

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : 163/8(20 ఓవర్లు)

(మెగ్ లానింగ్ 55, మేఘ్న సింగ్ 4/37, గార్డ్‌నెర్ 2/37)

గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ : 138/8(20 ఓవర్లు)

(గార్డ్‌నెర్ 40, రాధా యాదవ్ 3/20, జొనాస్సెన్ 3/22) 

Tags:    

Similar News