అలా జరిగి ఉంటే.. ఆ దేశానికి ఆడేవాడిని : బుమ్రా
ప్రస్తుతం వరల్డ్ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఒకడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దిశ, స్పోర్ట్స్ : ప్రస్తుతం వరల్డ్ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఒకడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, భారత్ తరపున ఆడకపోయి ఉంటే బుమ్రా కెనడా టీమ్ తరపున ఆడేవాడట. తాజాగా జియో సినిమా ఇంటర్వ్యూలో బుమ్రా ఈ విషయాన్ని రివీల్ చేశాడు. భార్య సంజనా గణేశన్‌తో కలిసి ఈ ఇంటర్వ్యూకు హాజరైన బుమ్రా క్రికెట్ లైఫ్‌తోపాటు వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ‘నువ్వు కెనడాకు వెళ్లి అక్కడ కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నావా?’ అని బుమ్రాను సంజన అడిగింది.
దీనికి బుమ్రా స్పందిస్తూ.. ‘ఏ వీధికి వెళ్లినా ఐదుగురు ఆటగాళ్లు భారత్ తరపున ఆడాలనుకుంటారు. కాబట్టి, మనకు బ్యాకప్ ప్లాన్ ఉండాలి. మా బంధువులు కెనడాలో ఉంటున్నారు. అందుకే, నా చదువు పూర్తయిన తర్వాత అక్కడికి వెళ్లాలనుకున్నాం. మొదట కుటుంబంతో అక్కడి వెళ్లాలనుకున్నాం. కానీ,మా అమ్మ స్కూల్ ప్రిన్సిపాల్‌గా చేస్తుంది. కెనడా సంస్కృతి, సాంప్రదాయలు వేరు కావడంతో ఆమె అందుకు నిరాకరించింది. కానీ, నాకు ఇక్కడే అన్ని వర్కౌట్ అయ్యాయి. అందుకు నేను చాలా అదృష్టవంతుడిని. లేదంటే కెనడా టీమ్ తరపున ఆడేందుకు ప్రయత్నించేవాడిని. భారత జట్టుకు, ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది.’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. కాగా, ప్రస్తుతం బుమ్రా ఐపీఎల్-17లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. ఇప్పటివరకు టీమ్ ఇండియా తరపున 36 టెస్టుల, 89 వన్డేలు, 62 టీ20లు ఆడిన అతను 382 వికెట్లు పడగొట్టాడు.