టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు ముందంజ

సౌత్ కొరియాలో జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్‌షిప్ టోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించాయి.

Update: 2024-02-20 16:29 GMT

దిశ, స్పోర్ట్స్ : సౌత్ కొరియాలో జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్‌షిప్ టోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించాయి. మహిళల టీమ్ కేటగిరీలో భారత జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. చివరి గ్రూపు మ్యాచ్‌లో స్పెయిన్‌పై 2-3 తేడాతో గెలుపొందింది. తెలుగమ్మాయి ఆకుల శ్రీజ, మనిక బాత్రా తొలి రెండు గేమ్‌ల్లో కోల్పోవడంతో వెనుకబడిన భారత్.. చివరి మూడు మ్యాచ్‌ల్లో అద్భుతం చేసింది. ఐహికా ముఖర్జీ 11-8, 11-13, 11-8, 9-11, 11-4 తేడాతో రాడ్ ఎల్విరాపై నెగ్గి జట్టు ఖాతా తెరిచింది. తొలి గేమ్‌లో ఓడిన మనిక బాత్రా, ఆకుల శ్రీజ రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లో పుంజుకున్నారు. మనిక 11-9, 11-2, 11-4 తేడాతో మరియాను చిత్తు చేయగా.. నిర్ణయాత్మక మ్యాచ్‌లో శ్రీజ 11-6, 11-13, 11-6, 11-3 తేడాతో జాంగ్ సోఫియాను ఓడించడంతో భారత్ విజయం ఖామయైంది. దీంతో గ్రూపు-1లో మహిళల జట్టు రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. అక్కడ నేడు ఇటలీతో తలపడనుంది.

పురుషుల జట్టు కూడా..

వరుసగా రెండు ఓటములతో ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న భారత పురుషుల జట్టు ఆఖరి మ్యాచ్‌లో చెలరేగింది. న్యూజిలాండ్‌పై 3-0 తేడాతో విజయం సాధించి తర్వాతి రౌండ్‌కు చేరుకుంది. హర్మీత్ దేశ్ 11-5, 11-1, 11-6 తేడాతో చోయ్ తిమోతిని ఓడించి శుభారంభం చేశాడు. ఆ తర్వాత వరుసగా సత్యన్ జ్ఞానేశ్వరన్ 11-3, 11-7, 11-6 తేడాతో డెలా పెనా ఆల్ఫ్రెడ్‌పై, మానుష్ షా 10-12, 6-11, 11-4, 11-8, 11-6 తేడాతో మ్యాక్స్‌వెల్‌పై నెగ్గడంతో ఈ మ్యాచ్‌ను భారత్ ఏకపక్షంగా దక్కించుకుంది. ఈ విజయంతో గ్రూపు-3 పురుషుల జట్టు మూడో స్థానంలో నిలిచి టోర్నీలో ముందడగు వేసింది. 

Tags:    

Similar News