Women's T20 World Cup : భారత్, పాక్ మ్యాచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
భారత్, పాక్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలోనే దాయాదుల పోరును చూడబోతున్నాం.
దిశ, స్పోర్ట్స్ : భారత్, పాక్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలోనే దాయాదుల పోరును చూడబోతున్నాం. మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 6న భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. మహిళల టీ20 వరల్డ్ కప్ రివైజ్డ్ షెడ్యూల్‌ను ఐసీసీ సోమవారం రిలీజ్ చేసింది. యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి 20 వరకు టోర్నీ జరగనుంది. వాస్తవానికి ఈ ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యూఏఈకి తరలించిన విషయం తెలిసిందే.
దుబాయ్, షార్జాల్లో వేదికలుగా మొత్తం 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. 10 జట్లు పాల్గొంటుండగా.. రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఏలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లతోపాటు భారత్‌ను చేర్చారు. గ్రూపు-బిలో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి. గ్రూపు దశలో ప్రతి జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. టాప్-2 జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. అక్టోబర్ 17, 18 తేదీల్లో సెమీస్‌లు, 20న ఫైనల్ జరగనుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్‌కు రిజర్వ్ డే కేటాయించారు. అక్టోబర్ 3న బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మ్యాచ్‌తో టోర్నీ మొదలుకానుంది.
భారత్ మ్యాచ్‌లు ఇవే
గ్రూపు-ఏలో ఉన్న భారత్ అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తలపడటం ద్వారా టోర్నీని ఆరంభించనుంది. అనంతరం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాక్‌తో పోరు అక్టోబర్ 6న జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 9న శ్రీలంకతో, 13న ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. మొదటి మూడు మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనుండగా.. ఆసిస్‌తో పోరు షార్జాలో జరగనుంది. టీమిండియా సెమీస్‌కు చేరుకుంటే అక్టోబర్ 17న జరిగే తొలి సెమీస్‌లో ఆడనుంది. ప్రపంచకప్‌కు ముందు హర్మన్‌ప్రీత్ సేన రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 29న వెస్టిండీస్‌తో, అక్టోబర్ 1న సౌతాఫ్రికాతో తలపడనుంది.