అదరగొట్టిన అమ్మాయిలు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన హాకీ జట్టు

భారత మహిళల హాకీ జట్టు మరోసారి ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచేందుకు అడుగుదూరంలో నిలిచింది.

Update: 2024-11-19 16:00 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల హాకీ జట్టు మరోసారి ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచేందుకు అడుగుదూరంలో నిలిచింది. బిహార్‌లో జరుగుతున్న టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టిన భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లారు.టోర్నీలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా సెమీస్‌లోనూ అదే జోరు ప్రదర్శించింది. మంగళవారం జరిగిన సెమీస్‌లో జపాన్‌ను 2-0 తేడాతో చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. టోర్నీ చరిత్రలో ఫైనల్‌కు చేరుకోవడం భారత్‌కు ఐదోసారి. వరుసగా రెండోసారి.బుధవారం జరిగే ఫైనల్‌‌లో చైనా‌ను ఢీకొట్టనుంది.

భారత్, జపాన్ మధ్య సెమీస్ ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్లు గోల్ కోసం విశ్వప్రయత్నాలు చేశాయి. అయితే, మూడు క్వార్టర్స్‌ల్లో ఏ జట్టూ గోల్ చేయలేకపోయింది. ఇక, చివరిదైన నాలుగో క్వార్టర్స్‌లో భారత ప్లేయర్లు దూకుడు పెంచారు. ఒత్తిడిని అధిగమించారు. వైస్ కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ 48వ నిమిషంలో జట్టుకు తొలి గోల్ అందించింది. లాల్‌రెమ్సియామి 56వ నిమిషంలో రెండో గోల్ చేసింది. ఆఖరి నాలుగు నిమిషాల్లో జపాన్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. మరోవైపు, మంగళవారం ఉదయం జరిగిన తొలి సెమీస్‌లో చైనా 3-1 తేడాతో మలేసియాపై విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్, చైనా జట్లు టైటిల్ పోరులో తలపడటం ఇది రెండోసారి. 2016లో తొలిసారి ఫైనల్‌లో ఎదురుపడగా.. అప్పుడు భారతే విజేతగా నిలిచింది. 

Tags:    

Similar News