Women's Asia Cup : భారత్‌కు ఎదురుందా?.. నేడు సెమీస్‌లో బంగ్లాతో ఢీ

ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ బెర్త్‌పై కన్నేసింది.

Update: 2024-07-25 19:29 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ బెర్త్‌పై కన్నేసింది. నేడు సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఏ విధంగా చూసుకున్న బంగ్లాపై టీమిండియా గెలుపు సునాయాసమే. అయితే, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా అన్ని విభాగాల్లో రాణించాలని భారత్ భావిస్తోంది. గెలిస్తే టోర్నీ చరిత్రలో వరుసగా 9వ సారి ఫైనల్‌కు చేరుతుంది.

శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గ్రూపు దశను అజేయంగా ముగించింది. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియా శుక్రవారం సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో ఆడనుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా భారత్ పటిష్టంగా ఉంది. షెఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, రిచా ఘోష్, రోడ్రిగ్స్, హేమలత‌ భీకర ఫామ్‌లో ఉన్నారు. బ్యాటర్లకుతోడు బౌలర్లు కూడా రాణిస్తున్నారు. దీప్తి శర్మ, రేణుక, రాధా యాదవ్, తెలుగమ్మాయి అరుంధతి ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న భారత్‌‌ను ఎదుర్కోవడం బంగ్లాకు కఠిన సవాలే. గ్రూపు దశలో బంగ్లా మూడు మ్యాచ్‌ల్లో రెండింట నెగ్గి రెండో స్థానంలో సెమీస్‌కు చేరుకుంది. ఆ జట్టు బ్యాటింగ్ ముర్షిదా ఖాతును, కెప్టెన్ నిగర్ సుల్తానాపైనే ఆధారపడి ఉన్నది. భారత బౌలర్లు వీరిని త్వరగా అవుట్ చేస్తే ఆ జట్టును స్వల్ప స్కోరుకే కట్టడి చేయొచ్చు. మరోవైపు, బౌలర్లలో రబేయా ఖాన్, నహిద నుంచి టీమిండియా బ్యాటర్లు సవాల్ ఎదుర్కోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేయడం బంగ్లాపై ఆధిపత్యాన్ని తెలియజేస్తోంది. బంగ్లా గడ్డపైనే ప్రత్యర్థిని చిత్తు చేయడం గమనార్హం.

భారత్ 19.. బంగ్లా 3

టీ20 ఫార్మాట్‌లో బంగ్లాపై భారత్‌ తిరుగులేని ఆధిపత్యం కనబర్చింది. ఇప్పటివరకు భారత్, బంగ్లా జట్లు 22సార్లు తలపడ్డాయి. అందులో టీమిండియా 19 విజయాలు నమోదు చేయగా.. బంగ్లా మూడింట మాత్రమే నెగ్గింది. 

Tags:    

Similar News