Women’s Asia Cup 2024 : నేటి నుంచి మహిళల ఆసియా కప్.. పాక్‌తో భారత్ ఢీ
నేటి నుంచి మహిళల ఆసియా కప్ మొదలుకానుంది.
దిశ, స్పోర్ట్స్ : నేటి నుంచి మహిళల ఆసియా కప్ మొదలుకానుంది. ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యమిస్తున్నది. శుక్రవారం యూఏఈ, నేపాల్ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభకానుంది. అదే రోజు రాత్రి పాకిస్తాన్‌ను భారత్ ఢీకొట్టనుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు ఏలో భారత్, పాక్, నేపాల్, యూఏఈ జట్లు ఉండగా.. గ్రూపు బిలో బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, థాయిలాండ్ జట్లను చేర్చారు. టాప్-2 జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. ఈ నెల 28న ఫైనల్ జరగనుంది.
ఆసియా కప్‌లో భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. 8 ఎడిషన్లలో ఏడుసార్లు టీమిండియానే విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ ఆ రికార్డును కొనసాగించాలనుకుంటున్నది. టీమిండియా నాకౌట్‌కు చేరుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. గ్రూపు ఏలో భారత్‌కు పాక్‌తో తప్ప పెద్ద పోటీ లేదు. నేపాల్, యూఏఈపై విజయాలు నల్లేరు మీద నడకే. అయితే, నేడు పాక్‌పై గెలుపొందితే భారత్ నాకౌట్ సమీకరణాలు మరింత తేలికవుతాయి. ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాపై అదరగొట్టిన భారత అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్ భీకర ఫామ్‌లో ఉండటం భారత్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఆల్‌రౌండర్లు పూజ వస్త్రాకర్, దీప్తి వర్మ టచ్‌లో ఉన్నారు. రేణుక సింగ్, శ్రేయాంక పాటిల్, తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి, ఆశా శోభన, రాధా యాదవ్‌లతో బౌలింగ్ దళం కూడా పటిష్టంగా ఉంది. అలాగే, టీ20ల్లో పాక్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. 14 మ్యాచ్‌ల్లో టీమిండియా 11 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. పాక్ కేవలం మూడింట మాత్రమే నెగ్గింది. ఇరు జట్లు గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో చివరిసారిగా ఎదురుపడగా ఆ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేననే గెలుపొందింది.
ఎక్కడ చూడొచ్చంటే?
ఆసియా కప్‌లో ప్రతి రోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. నేడు పాక్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. జూలై 21న యూఏఈతో, 23న నేపాల్‌తో తలపడనుంది. ఇందులో యూఏఈతో మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుండగా.. మిగతా రెండు మ్యాచ్‌లో రాత్రి 7 గంటలకు మొదలవుతాయి. భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోని స్టార్ స్పోర్ట్స్ 3 చానెల్ ఆసియా కప్ మ్యాచ్‌లు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. అలాగే, డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ యాప్‌లో ఉచితంగా చూడొచ్చు.