కుల్దీప్ 2.0కు వాళ్లే కారణం : కుల్దీప్ యాదవ్

టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గతేడాది రీఎంట్రీకి ముందు గడ్డుపరిస్థితులు ఎదుర్కొన్నాడు.

Update: 2024-06-05 12:43 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గతేడాది రీఎంట్రీకి ముందు గడ్డుపరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఫామ్ లేమి, గాయం కారణంగా అతనికి అవకాశాలు తగ్గాయి. రీఎంట్రీ తర్వాత స్పిన్ మంత్రంతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న అతన్ని కుల్దీప్ 2.0గా పిలుచుకుంటున్నారు. ఇటీవల ఐపీఎల్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 16 వికెట్లు పడగొట్టాడు. తాజాగా కుల్దీప్ తాను కుల్దీప్ 2.0గా ఎలా మారానో వివరించాడు. తాను తిరిగి ఫామ్ అందుకోవడంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, హెడ్ కోచ్ రికీ పాంటింగ్, మాజీ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ కీలక పాత్ర పోషించారని చెప్పాడు.

ఢిల్లీ క్యాపిట్సల్స్ యూట్యూబ్ చానెల్‌లో కుల్దీప్ మాట్లాడుతూ..‘రెండేళ్లలో ఇంత మారతానని నేను అనుకోలేదు. 2022లో నేను ఢిల్లీలో చేరేటప్పుడు కొత్త నైపుణ్యాలతో వచ్చాను. కానీ, నాకు ఆత్మవిశ్వాసం అవసరం. దేని గురించి ఆందోళన చెందొద్దని, అన్ని మ్యాచ్‌లు ఆడతావని రికీ పాంటింగ్‌లో నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. పంత్ కూడా నాకు చాలా మద్దతుగా నిలిచాడు. అతను నన్ను నమ్మాడు. నాకు సోదరుడిలాంటి వాడు. ఇక, నేను తిరిగి ఫామ్ అందుకోవడంలో వాట్సన్‌ది పెద్ద పాత్ర. అతనితో అన్నీ పంచుకునేవాడిని. గంటల కొద్దితో అతనితో మాట్లాడేవాడిని. మా ఇద్దరి సంభాషణలు నేను ఫోన్‌లో నోట్ చేసుకున్నా. మ్యాచ్‌కు ముందు వాటిని రివైండ్ చేసుకుంటా.’ అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. తాను తొలి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నానని, ప్రపంచకప్ గెలవడం తన కల అని చెప్పాడు. అలాగే, క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక ఫుట్‌బాల్ కోచ్‌గా మారతానని తెలిపాడు. 


Similar News