Wimbledon 2024 : ఫైనల్‌కు క్రెజికోవా, పాలిని

వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్స్ ఫైనలిస్ట్‌లు ఎవరో తేలిపోయింది.

Update: 2024-07-11 19:32 GMT

దిశ, స్పోర్ట్స్ : వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్స్ ఫైనలిస్ట్‌లు ఎవరో తేలిపోయింది. చెక్ రిపబ్లిక్ స్టార్ క్రెజికోవా, ఇటలీకి చెందిన పాలిని ఫైనల్‌కు దూసుకెళ్లారు. వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరుకోవడం ఈ ఇద్దరికీ ఇదే తొలిసారి. టైటిల్ ఫేవరెట్లు నిష్ర్కమించడంతో ఈ సారి వింబుల్డన్‌కు కొత్త క్వీన్ రాబోతోంది. శనివారం టైటిల్ పోరు జరగనుంది.

ఇగా స్వైటెక్, కోకో గాఫ్, వొండ్రుసోవా ఇప్పటికే నిష్ర్కమించగా.. మరో టైటిల్ ఫేవరెట్ ఇంటిదారిపట్టింది. మాజీ చాంపియన్, 4వ సీడ్ రిబకినా(కజకస్థాన్) తన పోరాటాన్ని ముగించింది. సెమీస్‌లో ఆమెకు చెక్ రిపబ్లిక్ స్టార్ క్రెజికోవా షాకిచ్చింది. గురువారం జరిగిన సెమీస్‌లో క్రెజికోవా 3-6, 6-3, 6-4 తేడాతో రిబకినాపై విజయం సాధించింది. ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో మొదట రిబకినాదే ఆధిపత్యం. తొలి సెట్‌ను నెగ్గి శుభారంభం చేసింది. అనంతరం క్రెజికోవా పుంజుకోవడంతో ఆమె తడబడింది. ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా క్రెజికోవా దూకుడుగా ఆడి వరుసగా రెండు సెట్లను నెగ్గింది. దీంతో తొలిసారిగా వింబుల్డన్ సింగిల్స్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది. 4 ఏస్‌లు, 25 విన్నర్లతో క్రెజికోవా 4 సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. మరోవైపు, రిబాకినా 3 డబుల్ ఫౌల్ట్స్, 37 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.

పాలిని పోరాడి మరి

తొలి సెమీస్‌లో పాలిని కూడా పోరాడి నెగ్గింది. క్రోయేషియా క్రీడాకారిణి డొన్నా వెకిక్‌ను 2-6, 6-4, 7-6(10-8) తేడాతో చిత్తు చేసింది. పాలినికి కూడా మొదట శుభారంభం దక్కలేదు. వెకిక్ అలవోకగా తొలి సెట్‌ను దక్కించుకుంది. దీంతో పాలిని ఓటమి చెందేలా కనిపించింది. కానీ, ఆమె పుంజుకున్న తీరు అద్భుతం. రెండో సెట్‌లో ప్రత్యర్థి గట్టి పోటీనిచ్చినా పాలిని పట్టు వదల్లేదు. వెకిక్ తప్పిదాలను సద్వినియోగం చేసుకుని రెండో సెట్‌ను నెగ్గి పోటీలోకి వచ్చింది. ఇక, నిర్ణయాత్మక మూడో సెట్‌ హోరాహోరీగా సాగింది. ఎవరూ వెనక్కి తగ్గపోవడంతో విజయం ఎవరిని వరిస్తుందోనన్న టెన్షన్ మొదలైంది. ఇద్దరు చెరో రెండు బ్రేక్ పాయింట్లు పొంది సెట్‌ను టై బ్రేకర్‌కు తీసుకెళ్లారు. అక్కడ పాలిని నెగ్గడంతో మ్యాచ్ ఆమె వశమైంది. పాలిని 3 డబుల్ ఫౌల్ట్స్, 32 తప్పిదాలు చేస్తే.. వెకిక్ 7 డబుల్ ఫౌల్ట్స్, 57 తప్పిదాలు చేయడం ఆమె ఓటమికి కారణమైంది.


Similar News