Paris Olympics : ఇషా, శ్రీజ పతకం తెచ్చేనా?.. తెలంగాణ అథ్లెట్లపై ఆశలు
మరో రెండు రోజుల్లో పారిస్ విశ్వక్రీడలకు తెరలేవనుంది.
దిశ, స్పోర్ట్స్ : మరో రెండు రోజుల్లో పారిస్ విశ్వక్రీడలకు తెరలేవనుంది. ఈ ఒలింపిక్స్‌లో తెలంగాణ అమ్మాయిలు ఈషా సింగ్, ఆకుల శ్రీజ బరిలో ఉన్నారు. షూటింగ్‌లో ఇషా, టేబుల్ టెన్నిస్‌లో శ్రీజ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరికీ ఇవే తొలి విశ్వక్రీడలు. మొదటి ఒలింపిక్స్‌లో వీరు ఏ మేరకు మెరుస్తారో చూడాలి.
ఈషా గురి కుదిరేనా?
షూటింగ్‌లో భారత్‌కు ఒలింపిక్స్ పతకం దక్కి 12 ఏళ్లు అవుతోంది. చివరిసారిగా 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో భారత్ రెండు పతకాలు గెలిచింది. ఆ తర్వాత రియో, టోక్యో ఒలింపిక్స్‌ల్లో పతకం లేకుండానే షూటర్లు ఇంటిదారిపట్టారు. కానీ, పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో పతకం దక్కే అవకాశాలు ఉన్నాయి. స్టార్ షూటర్ మను భాకర్‌పై భారీ ఆశలు ఉన్నాయి. అలాగే, హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్‌పై కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. కొంతకాలంగా ఇషా సింగ్ నిలకడగా రాణిస్తున్నది. 2014లో ఆమె షూటింగ్ కెరీర్ మొదలుపెట్టింది. 2018లో జరిగిన నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇషా.. టాప్ షూటర్ మను భాకర్‌ను ఓడించి స్వర్ణం సాధించింది. 13 ఏళ్లలోనే సీనియర్ విభాగంలో నేషనల్ చాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. జూనియర్ విభాగంలో 2022లో 25 మీటర్ల పిస్టోల్ ఈవెంట్‌లో వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. గతేడాది ఆమె సంచలన ప్రదర్శన చేసింది. ఆసియా గేమ్స్‌లో టీమ్, వ్యక్తిగత ఈవెంట్లలో నాలుగు పతకాలు గెలిచింది. అలాగే, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో టీమ్ విభాగంలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ ఏడాది జరిగిన ఏసియన్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో ఇషా పారిస్ బెర్త్ సాధించింది. ఒలింపిక్స్‌లో ఇషా 25 మీటర్ల పిస్టోల్ కేటగిరీలో పోటీపడనుంది. మరి, తొలి విశ్వక్రీడల్లో ఇషా ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. షూటింగ్‌లో 15 కేటగిరీల్లో భారత్ నుంచి 15 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.
శ్రీజ చరిత్ర సృష్టిస్తుందా?
ఒలింపిక్స్‌లో 1988లో టేబుల్ టెన్సిస్‌ను చేర్చగా.. అప్పటి నుంచి భారత్ ఆ విభాగంలో ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇప్పటి వరకు ఆ క్రీడలో భారత్ ఒక్క పతకం సాధించలేదు. ప్రతిసారి ప్లేయర్లు పతకం తేవడంలో విఫలమవుతున్నారు. టోక్యో ఒలింపిక్స్ లో మిక్స్‌డ్ డబుల్స్‌లో నాలుగో రౌండ్‌కు చేరుకోవడమే విశ్వక్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన. అయితే, సారి పతక నిరీక్షణకు తెరదించాలని మన ప్లేయర్లు పంతంతో ఉన్నారు. మనిక బాత్రా, శరత్ కమల్‌లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే, కొంతకాలంగా సత్తాచాటుతున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ కూడా పతక ఆశలు రేపుతోంది. శ్రీజ ఉమెన్స్ సింగిల్స్‌తోపాటు డబుల్స్, టీమ్ ఈవెంట్లలో బరిలోకి దిగుతున్నది. ప్రస్తుతం శ్రీజ మహిళల సింగిల్స్‌లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నది. వరల్డ్‌లో 24వ ర్యాంక్‌లో ఉన్నది. 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో శరత్ కమల్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం పతకం సాధించింది. ఈ ఏడాది ఆమె మంచి ఫామ్‌లో ఉండటం సానుకూలంశం. ఈ ఏడాది రెండు డబ్ల్యూటీటీ టైటిల్స్ గెలిచింది. అలాగే, జూన్‌లో డబ్ల్యూటీటీ కంటెండర్ లాగోస్ విజేతగా నిలిచి.. కంటెండర్ స్థాయిలో టైటిల్ గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.