MS Dhoni: 'ధోనీ హెల్మెట్‌పై భారత జెండా ఉండదు'.. ఎందుకో తెలుసా?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. దేశ భక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జార్ఖండ్ డైనమైట్‌కు దేశమన్నా.. సైన్యమన్నా ఎంతో ఇష్టం.

Update: 2023-08-24 15:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. దేశ భక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జార్ఖండ్ డైనమైట్‌కు దేశమన్నా.. సైన్యమన్నా ఎంతో ఇష్టం. అంతర్జాతీయ క్రికెట్‌కు రెండు నెలలు బ్రేక్ ఇచ్చి మరీ ధోనీ సైన్యంలో పని చేశాడు. ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ తీసుకోని కశ్మీర్‌లో 15 రోజుల పాటు సైనికుడిగా సేవలందించిన విషయం తెలిసిందే.. తద్వారా భారత సైనికుడిగా పనిచేయాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. భారత ఆర్మీలో ధోనీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగి ఉన్నాడు. ఓ క్రీడాకారుడిగా.. సైనికుడిగా దేశం పట్ల క్రమశిక్షణతో ఉండే ధోనీ.. తన హెల్మెట్‌పై మాత్రం జాతీయ జెండాను పెట్టుకునేవాడు కాదు. ఎంతో దేశ భక్తి కలిగిన ధోనీ హెల్మెట్‌పై జాతీయ జెండాను ఎందుకు పెట్టుకోడనేది చాలా మందికి అంతు పట్టేది కాదు.

టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లతో పాటు విరాట్ కోహ్లీ తమ హెల్మెట్‌లపై జాతీయ పతాకంతో బరిలోకి దిగేవారు. ధోనీ హెల్మెట్‌పై మాత్రం బీసీసీఐ గుర్తు మాత్రమే ఉండేది. అయితే ఓ దేశ భక్తుడిగా జాతీయ జెండాపై తనకున్న గౌరవంతోనే ధోనీ తన హెల్మెట్‌పై జెండా ఉంచుకునేవాడు కాదు. వికెట్ కీపర్‌గా హెల్మెట్‌ను కిందపెట్టాల్సి వస్తుందని.. ఆ సమయంలో జాతీయ జెండా‌ను కింద ఉంచినట్లవుతుందని భావించే ధోనీ తన హెల్మెట్‌పై జాతీయ జెండా పెట్టుకునేవాడు కాదు. ఈ విషయాన్ని అతనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

మూడేళ్ల క్రితం దేశ స్వాతంత్ర్య దినోత్సవం( ఆగస్టు 15న) నాడే ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నైని ఛాంపియన్‌గా నిలబెట్టి ఐదో టైటిల్ అందించాడు. భారత్ తరఫున 350 వన్డేలు, 90 టెస్ట్‌లు, 98 టీ20లు ఆడిన ధోనీ.. 17 వేల పరుగులు చేశాడు. కెప్టెన్‌గా టీమిండియాకు టీ20 ప్రపంచకప్‌తో పాటు వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. ఇటీవలే మోకాలి సర్జరీ చేయించుకున్న ధోనీ.. ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్దమవుతున్నాడు.


Similar News