INDIA VS NEWZELAND : నాన్‌స్టాప్.. తొలి టెస్టు వర్షార్పణం
బెంగుళూరులో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఫలితంగా కివీస్ వర్సెస్ భారత్ మధ్య బుధవారం ప్రారంభం కావాల్సిన టెస్టు మ్యాచ్ నిలిచిపోయింది.
దిశ, స్పోర్ట్స్ : బెంగుళూరులో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఫలితంగా కివీస్ వర్సెస్ భారత్ మధ్య బుధవారం ప్రారంభం కావాల్సిన టెస్టు మ్యాచ్ నిలిచిపోయింది. తొలి రెండు సెషన్లు ముగిసినా చిన్నస్వామి స్టేడియంలో పిచ్‌పై కవర్లను తొలగించలేదు. అడపాదడపా జల్లులు కురుస్తుండటంతో మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందా? అసలు జరుగుతుందా? జరగదా? అన్న అనుమానాలు రేకెత్తుతున్న సమయంలో మధ్యాహ్నం టీ బ్రేక్ తర్వాత .. పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు తొలి రోజు మ్యాచును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.దీంతో టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. బెంగళూరులో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఆఫీసులకు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.
ఇండోర్‌లో ఆటగాళ్ల ప్రాక్టీస్..
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా క్రికెటర్లు బెంగళూరులోని ఇండోర్ స్టేడియంలో ఫుల్ ప్రాక్టీస్ చేశారు. ఎలాగైనా ఈ సిరీస్ గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉన్నది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, జైస్వాల్, గిల్ వంటి ప్లేయర్లు తీవ్రంగా కసరత్తులు చేసినట్లు తెలిసింది. అనుకోకుండా వరుణుడు మ్యాచ్‌కు అడ్డుతగలడంతో క్రికెటర్లు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం అయ్యారు. కోహ్లీ మాత్రం వింటేజ్ డ్రెస్‌లో వర్షం పడుతున్న తీరును పరిశీలించిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.
బంగ్లాపై గెలుపుతో ఫుల్ జోష్‌లో మనోళ్లు..
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్ సేన.. న్యూజిలాండ్‌పైనా అదే దూకుడును ప్రదర్శించాలని భావిస్తోంది.అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. గత కొన్నాళ్లుగా ఇరుజట్ల ప్రదర్శనను బేరీజు వేసుకుంటే.. ఈ మూడు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా పై చేయి సాధిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భారత జట్టులో శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్ ఫుల్ ఫామ్‌లో ఉండటం.. టెస్టులలో పునరాగమనం తర్వాత వికెట్ కీపర్ రిషభ్ పంత్ దూకుడు.. స్పిన్ ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజా ఆల్‌రౌండ్ షో.. బుమ్రా నేతృత్వంలోని పేస్ ఇలా అన్ని విభాగాల్లోనూ భారత్ దుర్భేద్యంగా ఉంది.
కివీస్ జట్టు సో సోగా..
గత కొన్ని సీజన్ల నుంచి న్యూజిలాండ్ జట్టు పరిస్థితి అధ్వాన్నంగా మారింది. గత ఐదు టెస్టుల్లో కివీస్ 4 మ్యాచ్‌లలో ఓడటం.. ప్రధాన బ్యాటర్లంతా ఫామ్‌లేమితో సతమతమవుతున్నారు. బౌలర్ల ప్రదర్శన సైతం అంతంతమాత్రంగానే ఉన్నది. దీనికి తోడు భారత్‌తో జరిగే సిరీస్‌లో కేన్ విలియమ్సన్ గజ్జల్లో నొప్పి కారణంగా జట్టుకు దూరం అయ్యాడనే కథనాలు వచ్చాయి. దీంతో ఆ జట్టు భారత్‌ను ఎలా అడ్డుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా, న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌ను 3-0తో రోహిత్ సేన క్లీన్‌స్వీప్ చేస్తే ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ ఫలితంతో సంబంధం లేకుండా నేరుగా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకునే అవకాశం ఉన్నది. ఇప్పటికే రెండు సార్లు టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఓడిన భారత్ ఈసారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విల్లూరుతోంది.
రోహిత్ ఎదుట రికార్డులు..
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుపై కన్నేశాడు. న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో హిట్‌మ్యాన్ 3 సిక్సర్లు బాదితే భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్నది. టెస్టుల్లో సెహ్వాగ్ 90 సిక్సర్లు బాదగా.. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 87 సిక్సర్లు కొట్టాడు. మరో మూడు సిక్సులు కొడితే సెహ్వాగ్ రికార్డును రోహిత్ బ్రేక్ చేసినట్లు అవుతుంది. దీనికి తోడు మరో 13 సిక్సర్లు బాదితే.. టెస్టుల్లో 100 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్నాడు. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన నాలుగో ఆటగాడిగా పేరొందనున్నాడు. ఇప్పటివరకు బెన్‌స్టోక్స్, బ్రెండన్ మెక్‌కల్లమ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లు సుదీర్ఘ ఫార్మాట్‌లో వందకు పైగా సిక్సర్లు కొట్టారు.
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు..
-వీరేంద్ర సెహ్వాగ్ – 103 టెస్టుల్లో 90 సిక్సర్లు
-రోహిత్ శర్మ- 61 టెస్టుల్లో 87 సిక్సర్లు
-ఎంఎస్ ధోని – 90 టెస్టుల్లో 78 సిక్సర్లు
-సచిన్ టెండూల్కర్ – 200 టెస్టుల్లో 69 సిక్సర్లు
-రవీంద్ర జడేజా – 74 టెస్టుల్లో 66 సిక్సర్లు
రోహిత్‌కు బెస్ట్ చాన్స్.. ఊరిస్తున్న కోహ్లీ రికార్డు..
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)లో భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ మొత్తం 12 విజయాలను అందించాడు. కాగా, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 14 విజయాలు సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేస్తే కోహ్లీ రికార్డును రోహిత్ శర్మ అధిగమించిన నాయకుడు అవుతాడు.
WTC పాయింట్స్ టేబుల్.. మనమే నంబర్ వన్
WTC ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్‌లో మొత్తం 11 టెస్టులు ఆడిన భారత్ ప్రస్తుతం (PCT) 74.24 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాత 12 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా 62.50తో రెండవ స్థానంలో ఉంది. దీంతో WTC ఫైనల్‌కు చేరుకునేందుకు ఆసీస్, భారత జట్లు ఫేవరెట్‌లుగా నిలిచాయి. శ్రీలంక జట్టు 9 టెస్టుల తర్వాత 55.56 PCTతో మూడో స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్ 17 తర్వాత 45.59తో నాలుగో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 38.89 PCTతో మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది.