ఆకాశ్ దీప్ ఎవరు?.. భారత టెస్టు జట్టుకు ఎంపికైన బెంగాల్ పేసర్
బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ తొలిసారిగా టెస్టు జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ తొలిసారిగా టెస్టు జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో మిగతా మూడు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో అతనికి చోటు దక్కింది. తొలి రెండు టెస్టులకు ఎంపికైన అవేశ్ ఖాన్‌ను పక్కనపెట్టి మరి సెలెక్టర్లు ఆకాశ్ దీప్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఆకాశ్ దీప్ పరిమిత ఓవర్లలో ఇప్పటికే జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. గతేడాది ఆసియా క్రీడలకు ప్రకటించిన ద్వితీయ శ్రేణి జట్టుకు ఎంపికైనప్పటికీ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
27 ఏళ్ల ఆకాశ్ దీప్ బిహార్‌లోని డెహ్రీలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే అతనికి క్రికెట్‌పై మక్కువ ఉండేది. 2010లో అతను బెంగాల్‌కు వెళ్లాడు. అక్కడ ఆకాశ్‌కు అతని అంకుల్ నుంచి ప్రోత్సాహం లభించింది. క్రికెటర్ కావాలనుకున్న కల కోసం అతను నిరంతరం కష్టపడ్డాడు. ఈ క్రమంలో 2019లో బెంగాల్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి బెంగాల్ తరపున నిలకడగా రాణిస్తున్న అతను 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 103 వికెట్లు తీసుకున్నాడు. 28 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 42 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీలో సత్తాచాటతున్న ఆకాశ్ దీప్‌ను 2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అదే ఏడాది ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన అతను.. గత సీజన్‌లోనూ ఆర్సీబీకి ఆడాడు. 7 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసుకున్నాడు.
ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్‌తో అనధికార టెస్టు సిరీస్‌లోనూ భారత్ ఏ జట్టు తరపున ఆకాశ్ సత్తాచాటాడు. మూడు మ్యాచ్‌ల్లో 18 సగటుతో 13 వికెట్లు తీశాడు. భారత ఏ జట్టు తరఫున టాప్ వికెట్ టేకర్ అతనే. మాథ్యూ పాట్స్(21) తర్వాత సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శననే ఇంగ్లాండ్ మిగతా మ్యాచ్‌లకు అతన్ని ఎంపికయ్యేలా చేసింది. అయితే, తుది జట్టులో అతనికి చోటు దక్కడం అంత సులభం కాదు. మరో పేసర్ ముకేశ్ కుమార్‌తో అతనికి పోటీ తప్పదు. మిగతా సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడతాడో లేదా చూడాలి.