పాకిస్థాన్ వచ్చి క్రికెట్ ఆడాలంటే ఇండియాకు భయం.. పీసీబీ చీఫ్ ఆసక్తికర కామెంట్స్

Update: 2023-03-14 10:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ వేదికగా సెప్టెంబర్‌లో జరుగబోయే ఆసియా కప్ ఆడేందుకు టీమ్ ఇండియా జట్టు అక్కడికి వెళ్లబోమని చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పీసీబీ చీఫ్ నజమ్ సేథీ మరోసారి ఆసియా కప్ నిర్వహణపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లు పాకిస్తాన్‌కు వచ్చి క్రికెట్ ఆడుతుంటే.. భారత్‌కు మాత్రమే భద్రతా సమస్యలు ఎందుకు కనబడుతున్నాయని ప్రశ్నించాడు. ‘క్రికెట్ ఆడేందుకు మిగతా జట్లు పాకిస్తాన్‌కు వస్తున్నాయి. వాళ్లు భద్రత గురించి ఏ సమస్యలు ఉన్నాయని చెప్పడం లేదు.

కానీ భారత్ మాత్రమే సెక్యూరిటీ రీజన్స్‌ను చూపుతున్నది..? ఇదే రీతిలో మేము కూడా ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు భారత్‌కు వెళ్లబోమని చెప్పాం. భారత్ వ్యవహరిస్తున్న వైఖరికి మేం వ్యతిరేకమని.. ఎందుకంటే ఇదేదో ఒక్క ఆసియా కప్‌కు సంబంధించిన విషయం కాదు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌తో పాటు 2025లో ఐసీసీ నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా పాకిస్తాన్‌లోనే జరుగనుంది.

అయితే భారత్.. ఆసియా కప్ ఆడేందుకు పాక్‌కు రాకున్నా తాము వన్డే వరల్డ్ కప్ కోసం ఇండియాకు వెళ్లాలని తమ ప్రభుత్వం చెబితే వెళ్లాల్సిందేనని నజమ్ సేథీ అని పేర్కొన్నాడు. నజమ్ సేథీ.. గత నెలలో బహ్రెయిన్‌లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈ వివాదంపై ఏదో ఒక పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సూచించాడు. ఈ సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడు జై షా తో పాటు బీసీసీఐ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అప్పుడు కూడా బీసీసీఐ తన నిర్ణయాన్ని చెప్పేసింది. భారత్.. పాక్‌కు వెళ్లే విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది.

Tags:    

Similar News