Kuldeep Yadav: 'ఆటకు వీడ్కోలు పలికినా.. ఈ స్పెల్‌ గుర్తుండిపోతుంది'

ఆసియా కప్‌-2023లో భాగంగా సూపర్-4లో పాకిస్థాన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Update: 2023-09-12 12:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌-2023లో భాగంగా సూపర్-4లో పాకిస్థాన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్‌ను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్ కుల్‌దీప్‌ యాదవ్‌ కీలక పాత్ర పోషించాడు. దీంతో భారత్‌ 228 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. పాక్‌ను 128 పరుగులకే ఆలౌట్‌ చేయడం వెనుక కుల్‌దీప్‌ (8 ఓవర్లలో 5/25) ప్రదర్శనే కారణం. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కుల్‌దీప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆట నుంచి దూరమైనప్పటికీ ఇలాంటి స్పెల్‌ తప్పకుండా జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు.

''చాలా సంతోషంగా ఉందని చెప్పడం మినహా ఏమీ మాట్లాడలేను. కానీ, అత్యుత్తమ జట్టుపై ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం అద్భుతంగా అనిపిస్తోంది. తప్పకుండా జీవితాంతం గుర్తుండిపోతుంది. క్రికెట్‌ను ఆడటం ఆపేసి వీడ్కలు పలికినా సరే ఈ స్పెల్‌ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైందే. పాక్‌పై ఐదు వికెట్లు తీసుకోవడం అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే, స్పిన్‌ను చక్కగా ఆడగలిగే ఉపఖండ జట్టుపై ఇలాంటి ప్రదర్శన చేయడం వల్ల మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది'' అని కుల్‌దీప్‌ యాదవ్‌ తెలిపారు. 2017లో వన్డేల్లోకి అడుగు పెట్టిన కుల్‌దీప్‌ 87 వన్డేల్లో 146 వికెట్లు తీశాడు. వచ్చే ప్రపంచకప్‌ జట్టులోనూ స్థానం సంపాదించాడు.


Similar News