WI vs SA : సౌతాఫ్రికాకు షాక్ ఇచ్చిన వెస్టిండీస్.. తొలి టీ20 కరేబియన్ జట్టుదే
దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆతిథ్య వెస్టిండీస్ శుభారంభం చేసింది. ట్రినిడాడ్ వేదికగా శనివారం జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది నికోలస్ పూరన్(65 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 174/7 స్కోరు చేసింది. సఫారీలకు దక్కిన ఆరంభం చూస్తే 100 పరుగుల్లోపు ఆలౌటయ్యేలా కనిపించింది.
కెప్టెన్ మార్‌క్రమ్(14), హెండ్రిక్స్(4), రికెల్టన్(4), డస్సెన్(5), డోనోవన్ ఫెరీరా(8) విఫలమవడంతో జట్టు 42/5 స్కోరుతో తీవ్ర కష్టాల్లో పడింది. ఆ పరిస్థితుల్లో ట్రిస్టన్ స్టబ్స్(76) సంచలన ఇన్నింగ్స్ గాడిలో పెట్టాడు. పాట్రిక్ కుగర్(44) కూడా కీలక పరుగులు చేయడంతో సౌతాఫ్రికా పోరాడే స్కోరు చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్(3/27), జోసెఫ్(2/40) సత్తాచాటారు. అనంతరం 175 పరుగుల లక్ష్యాన్ని కరేబియన్ జట్టు 17.5 ఓవర్లలోనే ఛేదించింది. 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 176 పరుగులు చేసింది.
ఓపెనర్లు షాయ్ హోప్(51), అలిక్ అథనాజె(40) శుభారంభం అందించగా.. పూరన్(65 నాటౌట్) సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకపడ్డాడు. ఎడాపెడా సిక్స్‌లు కొట్టి కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పూరన్ మొత్తంగా 26 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో విండీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం రెండో టీ20 సోమవారం జరగనుంది.