West Indies vs South Africa: చెలరేగిన బౌలర్లు.. ఒకే రోజు 17 వికెట్లు

ఆతిథ్య వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు డ్రా అయిన విషయం తెలిసిందే.

Update: 2024-08-16 13:36 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు డ్రా అయిన విషయం తెలిసిందే. ఇక, గయానా వేదికగా గురువారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) రెండో టెస్టు ఆసక్తికరంగా ప్రారంభమైంది. తొలి రోజు బౌలర్లదే ఆధిపత్యం. ఇరు జట్ల బౌలర్లు ఒకే రోజు 17 వికెట్లు పడగొట్టడం గమనార్హం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. డేన్ పీడ్ట్ చేసిన 38 పరుగులకే టాప్ స్కోరంటే సఫారీల ఆటను అర్థం చేసుకోవచ్చు. షమార్ జోసెఫ్(5/33) ఐదు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి పతనాన్ని శాసించగా.. జేడెన్ సీల్స్(3/45) కూడా సత్తాచాటాడు.

అనంతరం తొలి రోజే తొలి ఇన్నింగ్స్‌కు దిగిన విండీస్ కూడా తడబడింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 97/7 స్కోరుతో నిలిచింది. వియాన్ ముల్డర్(4/18), నాండ్రే బర్గర్(3/32) కరేబియన్ జట్టును దెబ్బతీశారు. కెప్టెన్ బ్రాత్‌వైట్(3), లూయిస్(0), అథనాజె(1), కావెమ్ హోడ్జ్(4), జాషువా డా సిల్వ(4) విఫలమమవడంతో 50 పరుగుల్లోపే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హోల్డర్(33 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. విండీస్ ఇంకా 63 పరుగులు వెనుకబడి ఉన్నది. 

Tags:    

Similar News