విభిన్నమైన గేమ్‌ప్లే, ప్లాన్స్‌తో ఒలింపిక్స్‌ బరిలో.. : సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి

పారిస్ ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం కోసం కష్టపడుతున్నామని భారత డబుల్స్ స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ తెలిపాడు.

Update: 2024-02-04 13:33 GMT

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌లో తన భాగస్వామి చిరాగ్ శెట్టి, తాను అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం కోసం కష్టపడుతున్నామని భారత డబుల్స్ స్టార్ షట్లర్, తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి తెలిపాడు. ఇటీవల సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో పురుషుల డబుల్స్‌లో వరల్డ్ నం.1 ర్యాంక్‌ను సాధించిన విషయం తెలిసిందే. తాజాగా మీడియాతో సాత్విక్ పారిస్ ఒలింపిక్స్‌ సన్నద్ధత గురించి మాట్లాడాడు. ‘మేము ఇప్పుడే గరిష్ట స్థాయికి చేరుకోవాలనుకోవడం లేదు. ఒలింపిక్స్‌లోనే మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం. ఒలింపిక్స్‌కు ముందు విభిన్నమైన గేమ్ ప్లే, వ్యూహాలతో ఆడతాం.’అని చెప్పాడు. ఒలింపిక్స్‌ ముందు తాము ఆడే టోర్నీలు చాలానే ఉన్నా, తాము మాత్రం ఒలింపిక్స్ గురించే ఆలోచిస్తున్నామన్నాడు. ‘ఒలింపిక్స్ ముందు మా ముందు చాలా టోర్నీలు ఉన్నాయి. ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ మాకెంతో స్పెషల్. అక్కడ సత్తాచాటాలనుకుంటున్నాం. కానీ, మనసులో మాత్రం ఒలింపిక్స్ గురించే ఆలోచిస్తున్నాం.’ అని చెప్పుకొచ్చాడు.

మార్చిలో జరగబోయే ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో సాత్విక్, చిరాగ్ శెట్టి జోడీ టాప్ సీడ్‌లో బరిలోకి దిగనుంది. దీనిపై సాత్విక్ స్పందిస్తూ.. ‘టాప్ సీడ్ ప్రత్యేకమైనదే. కానీ, నంబర్లు కేవలం సంతోషం కోసమే. ఎవరి చేతుల్లోనైనా ఓడిపోవచ్చు. సీడింగ్ గురించి మేము ఎక్కువగా ఆలోచించడం లేదు. అయితే, గతంలో ఆల్ ఇంగ్లాండ్‌లో మేము బాగా ఆడలేదు. ఈ సారి పోడియం చేరుకోవాలనుకుంటున్నాం ’ అని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో ఓడిపోవడం మంచిదేనని, వరుసగా గెలుస్తుంటే రిలాక్స్ అవుతామన్నాడు. ఇండియా ఓపెన్‌లో ఓడిపోవడం తాము తిరిగి పుంజుకోవడానికి ఉపయోగపడిందని చెప్పాడు. కాగా, ఈ ఏడాది వరుసగా మలేషియా ఓపెన్, ఇండియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న సాత్విక్ జోడీ ఫైనల్‌లో పరాజయం పాలైంది.

Tags:    

Similar News