బాబర్ ఆటను ఎంజాయ్ చేస్తా : Virat Kohli

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఆట చూడటానికి ఇష్టపడతానని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు.

Update: 2023-08-13 13:58 GMT

న్యూఢిల్లీ : పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఆట చూడటానికి ఇష్టపడతానని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోహ్లీ.. బాబర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘2019 వరల్డ్ కప్‌ సందర్భంగా బాబర్‌ను మొదటిసారి కలిశా. మొదటిసారి మాట్లాడా. పాకిస్తాన్ ఆటగాడు ఇమాద్ వసీమ్ నాకు అండర్ 19 వరల్డ్ కప్ నుంచే తెలుసు. అతనే బాబర్ నీతో మాట్లాడాలనుకుంటున్నాడని నాతో చెప్పాడు. బాబర్, నేను కూర్చుని ఆట గురించి మాట్లాడుకున్నాం. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ అతను నా పట్ల ఎంతో గౌరవం చూపిస్తాడు. ప్రస్తుతం బాబర్ మూడు ఫార్మాట్లలోనూ టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. నిలకడగా రాణిస్తున్నాడు. అతని ఆటను చూసేందుకు నేను చాలా ఇష్టపడతా.’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

కాగా, భారత్, పాక్ జట్లు చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ టోర్నీలో మాత్రమే ఇరు జట్లు ఎదురుపడుతున్నాయి. గతేడాది టీ20 ప్రపంచ కప్‌లో చివరిసారిగా తలపడగా.. మరికొద్ది రోజుల్లోనే భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను చూడబోతున్నాం. ఆసియ కప్‌లో భాగంగా సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. అలాగే, భారత గడ్డపై జరగబోయే వన్డే వరల్డ్ కప్‌లో అక్టోబర్ 15న దాయాదుల పోరు జరగనుంది.

Tags:    

Similar News