Virat Kohli: టెస్ట్ ర్యాంకింగ్ టాప్ 20 నుంచి కోహ్లి ఔట్
ఐసీసీ టెస్ట్ తాజా ర్యాంకింగ్స్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి 22వ స్థానానికి పడిపోయాడు. 2014 డిసెంబర్ తర్వాత కోహ్లి టాప్-20 నుంచి పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కోహ్లి కేవలం 93 పరుగులు మాత్రమే చేసిన విషయం తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ టెస్ట్ తాజా ర్యాంకింగ్స్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి 22వ స్థానానికి పడిపోయాడు. 2014 డిసెంబర్ తర్వాత కోహ్లి టాప్-20 నుంచి పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కోహ్లి కేవలం 93 పరుగులు మాత్రమే చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోనూ కోహ్లి 13.4 యావరేజ్‌తో 134 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లి తన టెస్ట్ కెరీర్‌లో 2016 నుంచి 2018 వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. 2018లో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్ చేరుకున్న కోహ్లి అదే ఏడాది మూడు ఫార్మాట్‌లలో నెంబర్ 1 గా నిలిచిన తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 9వేల పరుగులు మైలురాయిని అధిగమించిన కోహ్లి ఆరు ఇన్నింగ్స్‌లో ఆడి కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కోహ్లి టెస్ట్ యావరేజ్ 48 నుంచి 47.83కి పడిపోయింది. అయితే అక్టోబర్ 2019లో అతని యావరేజ్ 55.10గా ఉంది. దీంతో తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ 8 స్థానాలు పడిపోయిన కోహ్లి 22వ స్థానానికి చేరుకున్నాడు.
ఫస్ట్ ప్లేస్‌లో జోరూట్.. 6వ స్థానంలో రిషబ్ పంత్
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో జోరూట్ నెంబర్ 1 ర్యాంక్‌లో ఉండగా.. కేన్ విలియమ్‌సన్ రెండో స్థానంలో, హ్యారీ బ్రూక్ మూడో స్థానంలో నిలిచారు. భారత్ నుంచి యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్ 4వ స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత 6వ స్థానంలో రిషబ్ పంత్ ఉండగా.. 16వ స్థానంలో శుభ్ మన్ గిల్ ఉన్నాడు.
బౌలింగ్ విభాగంలో ఇలా..
సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబడ తాజాగా 11 పాయింట్లు సాధించి మొత్తం 872 పాయింట్లతో టెస్ట్ బౌలర్లలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా మూడవ స్థానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా టాప్ 10 బౌలర్ల జాబితాలో కొనసాగుతున్నారు. అశ్విన్ ఒక స్థానం పడిపోయి ఐదో స్థానంలో ఉండగా.. రవింద్ర జడేజా రెండు స్థానాలు మెరుగై ఆరో స్థానంలో నిలిచాడు.