న్యూఢిల్లీ : టీం ఇండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడానికి గల కారణాలపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'టీ20 వరల్డ్ కప్ ఓడిపోవడం వలన బీసీసీఐలో కొందరు విరాట్‌కు వ్యతిరేకంగా పనిచేశారని, వారి లాబీయింగ్ వల్లే కోహ్లీ జట్టుకు నాయకత్వం వహించే బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని' పేర్కొన్నారు. టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ఓటమి పాలైతే అది విరాట్‌కు అతిపెద్ద సమస్యగా మారుతుందన్న విషయంపై తనకు ముందే అవగాహన ఉందన్నారు. ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షోయెబ్ అక్తర్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ప్రపంచ స్థాయి ఆటగాడని, అందరి కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడని గుర్తుచేశారు.
ఇకపై అథ్యధిక పరుగులు సాధించడంలో కోహ్లీ దృష్టి సారించాలని, కెరీర్‌లో మరో మైలురాయిని అందుకోవాలని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ అక్తర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, టీ20 వరల్డ్ కప్ ఓటమి తర్వాత విరాట్ పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పగా.. వన్డే కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీఐ రోహిత్‌కు అప్పగించింది. ఇక సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు ఓటమి అనంతరం టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.