Vinesh Phogat : వాళ్ల కోసం నా పోరాటం ఇప్పుడే మొదలైంది.. కీలక వ్యాఖ్యలు చేసిన వినేశ్

తన పోరాటం ముగియలేదని, ఇప్పుడే మొదలైందని భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగట్ తెలిపింది.

Update: 2024-08-26 12:42 GMT

దిశ, స్పోర్ట్స్ : తన పోరాటం ముగియలేదని, ఇప్పుడే మొదలైందని భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగట్ తెలిపింది. పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల కేటగిరీలో పాల్గొన్న వినేశ్ ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ అదనపు బరువు కారణంగా అనర్హతకు గురై పతకం కోల్పోయింది. అయితే, ఆమెను గోల్డ్ మెడలిస్ట్‌గానే చూస్తామని వినేశ్ పెదనాన్న మహవీర్ ఫొగట్ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా వినేశ్ పుట్టిన రోజు సందర్భంగా హర్యానాలోని సర్వ్‌ఖాప్ పంచాయతీ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ప్రత్యేకంగా గోల్డ్ మెడల్ అందజేశారు. ఈ సందర్భంగా వినేశ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది.

‘నా పోరాటం ముగియలేదు. ఇప్పుడే మొదలైంది. మా ఆడపడుచుల గౌరవం కోసం ఇప్పుడే మొదలైంది. మేము నిరసనలు చేసినప్పుడు ఇదే చెప్పాం. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు దూరమైనప్పుడు నేను దురదృష్టవంతురాలిని అనుకున్నా. కానీ, భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత నాకు లభించిన మద్దతు, ప్రేమను చూసిన తర్వాత నేను అదృష్టవంతురాలినే అని భావిస్తున్నా. ఏ పతకానికైనా మించిన ఈ గౌరవానికి ఎప్పటికీ రుణపడి ఉంటా.’ అని తెలిపింది.

కాగా, ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ నిలిచింది. 100 గ్రాముల అదనపు బరువు కారణంగా ఆమెపై వేటు వేయడంలో రెజ్లింగ్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమైంది. రజతం ఇవ్వాలని కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్ స్పోర్ట్స్‌‌ను ఆశ్రయించగా.. అక్కడ కూడా వినేశ్‌కు నిరాశే ఎదురైంది. మరోవైపు, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌ సింగ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ గతేడాది రెజ్లర్లు చేపట్టిన నిరసనల్లో వినేశ్ కీలక పాత్ర పోషించింది. 

Tags:    

Similar News