Paris Olympics : ధీరజ్ బాణం పతకం తెచ్చేనా?.. విజయవాడ కుర్రాడిపై ఆశలు

ఆర్చరీలో ఇప్పటివరకు భారత్‌‌ ఒక్క ఒలింపిక్స్‌ పతకం సాధించలేదు.

Update: 2024-07-21 19:33 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆర్చరీలో ఇప్పటివరకు భారత్‌‌ ఒక్క ఒలింపిక్స్‌ పతకం సాధించలేదు. ప్రతిసారి మన ఆర్చర్లు ఖాళీ చేతులతోనే వస్తున్నారు. కానీ, ఈ సారి భారత ఆర్చరీ జట్టు పతకం తెచ్చేలా కనిపిస్తోంది. ఐదు కేటగిరీల్లో ఆరుగురు భారత ఆర్చర్లు పోటీలో ఉన్నారు. దీపిక కుమారి, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ వంటి అనుభవజ్ఞులు జట్టులో ఉన్నారు. 2022లో బిడ్డకు జన్మిచ్చి ఈ ఏడాది తిరిగి ఆటలో అడుగుపెట్టిన సీనియర్ ఆర్చర్ దీపిక కుమారిపై అందరి దృష్టి ఉంది. అలాగే, తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌పై పతక ఆశలు భారీగానే ఉన్నాయి. అతనితోపాటు మహిళా ఆర్చర్లు భజన్ కౌర్, అంకిత భక్త్‌లకు ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. మరి, ఆర్చరీలో భారత్ పతక నిరీక్షణ‌కు ఈ సారి తెరపడుతుందో?లేదో? చూడాలి.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. రికర్వ్ కేటగిరీలో భారత నం.1 ఆర్చర్‌గా ఉన్నాడు. గత 12 నెలల్లో అతను 10 అంతర్జాతీయ పతకాలు సాధించాడు. గతేడాది ఆసియా క్రీడల్లో, ఈ ఏడాది షాంఘై ప్రపంచకప్‌లో రికర్వ్ పురుషుల జట్టు స్వర్ణం సాధించడంలో ధీరజ్ కీలక పాత్ర పోషించాడు. అలాగే, గతేడాది, ఈ ఏడాది అంటాల్యా ప్రపంచకప్‌ల్లో వ్యక్తిగత రికర్వ్ విభాగంలో వరుసగా కాంస్యం సాధించాడు. మొత్తం అతని ఖాతాలో 8 ప్రపంచకప్ పతకాలు ఉన్నాయి. భారత్‌కు ఆర్చరీలో తొలి పారిస్ ఒలింపిక్స్ బెర్త్ అందించింది అతనే. గతేడాది ఆసియా క్వాలిఫయర్ టోర్నీలో రజతం గెలిచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ధీరజ్‌ తొలిసారిగా ఒలింపిక్స్ బరిలో నిలిచాడు. నిలకడగా రాణిస్తుండటంతో అతనిపై పతక అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ధీరజ్ పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంతోపాటు పురుషుల జట్టు ఈవెంట్‌లోనూ పాల్గొననున్నాడు.

భారత్ ఆర్చరీ జట్టు

పురుషుల రికర్వ్ : బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్

మహిళల రికర్వ్ : భజన్ కౌర్, దీపిక కుమారి, అంకిత భక్త్

Tags:    

Similar News