CPL 2023: 140 కిలోల బరువు.. తొలి బంతికే పరుగెత్తి రనౌట్‌ అయిన విండీస్‌ బాహుబలి

వెస్టిండీస్‌ భారీకాయుడు రకీం కార్న్‌వాల్‌ కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ తొలి బంతికే పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు.

Update: 2023-08-18 14:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌ భారీకాయుడు రకీం కార్న్‌వాల్‌ కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ తొలి బంతికే పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. 6.5 అడుగుల ఎత్తు, దాదాపు 140 కిలోల బరువు ఉండే ఈ క్రికెటర్ టీ20 క్రికెట్‌లో కేవలం 77 బంతుల్లోనే 205 పరుగులు బాదేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల వెస్టిండీస్‌, భారత్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లోనూ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తన బరువు కారణంగా రఖీమ్‌ కార్న్‌వాల్ వికెట్ల మధ్య పరుగెత్తడానికి ఇష్టపడడు. హిట్టింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అతడు రన్స్‌ కోసం పరుగెత్తడం చాలా అరుదు. ప్రస్తుతం ఈ విండీస్‌ బాహుబలి కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌‌లో ఆడుతున్నాడు.

బార్బడోస్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ ఆల్‌రౌండర్ ఆశ్చర్యకరంగా ఇన్నింగ్స్‌ మొదటి బంతికే రిస్క్‌తో కూడిన సింగిల్‌కు యత్నించి రనౌటయ్యాడు. సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో బార్బడోస్ రాయల్స్‌ తరఫున రఖీమ్ కార్న్‌వాల్, కైల్ మేయర్స్‌ ఓపెనర్లుగా రాగా.. మొదటి బంతి వైడ్‌ కావడంతో ఒక పరుగు వచ్చింది. తర్వాతి బంతిని ఎదుర్కొన్న భారీకాయుడు కార్న్‌వాల్‌ రిస్క్‌ చేసి సింగిల్ కోసం యత్నించాడు. కానీ, వేగంగా పరుగెత్తలేక రనౌటైపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Similar News