వెంకటేశ్ అయ్యర్ కీలక నిర్ణయం.. కీలక ఒప్పందం చేసుకున్న ఆల్‌రౌండర్
టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. కౌంటీ క్లబ్ లంకాషైర్‌తో అతను ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయాన్ని కౌంటీ క్లబ్ శుక్రవారం వెల్లడించింది. కౌంటీ క్రికెట్ ఆడటం అయ్యర్‌కు ఇదే తొలిసారి. లంకాషైర్ తరపున వన్డే కప్ టోర్నీతోపాటు కౌంటీ చాంపియన్‌షిప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు. అయ్యర్ పేరును ఇంగ్లాండ్ వికెట్ కీపర్ ఫిల్‌ప్ సాల్ట్ క్లబ్‌కు సూచించినట్టు తెలుస్తోంది. ఐపీఎల్‌లో అయ్యర్, సాల్ట్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడిన విషయం తెలిసిందే.
‘ఇంగ్లాండ్‌కు వెళ్లేందుకు, నా కెరీర్‌లో తొలిసారిగా కౌంటీ క్రికెట్ ఆడేందుకు సంతోషిస్తున్నా. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో వన్డే, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నా నైపుణ్యాలను పరీక్షించుకోవడం నా ఆటకు సహాయపడుతుంది.’ అని వెంకటేశ్ పేర్కొన్నాడు. ఐదు వారాలపాటు అతను క్లబ్‌కు సేవలందించనున్నాడు. ఆ తర్వాత భారత దేశవాళీ క్రికెట్‌లో దులీప్ ట్రోఫీకి అందుబాటులో ఉండనున్నాడు. కాగా, 2022లో శ్రీలంకపై భారత్ తరపున చివరి మ్యాచ్ ఆడిన అతను ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 13 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేశాడు.